2016లో మోడీ సర్కార్ తీసుకున్న డిమానిటైజేషన్(నోట్లరద్దు) నిర్ణయంపై దాఖలైన అన్ని పిటిషన్లపై తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రిజర్వ్‌లో వుంచింది. డిమానిటైజేషన్‌కు సంబంధించిన అన్ని పత్రాలను సీల్డ్ కవర్‌లో తమకు అందించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఇరు పక్షాలు దీనిపై శనివారంలోగా లిఖిత పూర్వక సమాధానాలు ఇవ్వాలని జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం సూచించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆర్థిక విధానాలకు సంబంధించిన అంశాల్లో న్యాయసమీక్ష అధికారం పరిమితంగా ఉందంటే దాని అర్థం కోర్టు చేతులు కట్టుకుని కూర్చుంటుందని కాదని పేర్కొంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఎప్పుడైనా పరిశీలించ వచ్చని వెల్లడించింది.
కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అతిపెద్ద తప్పిదంగా పిటిషనర్ అభివర్ణించారు. మాజీ ఆర్థికమంత్రి చిదంబరం, ఆర్బీఐ సిఫార్సుల మేరకే నోట్ల రద్దు చేయాల్సి ఉంటుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
ఈ విషయంలో కేంద్రం సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదన్నారు. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ… ప్రస్తుతం దానిపై నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపశమనమూ లభించదని వాదనలు వినిపించారు.
తాత్కాలిక కష్టాలు ఉన్నాయని, కానీ అవి దేశ నిర్మాణ ప్రక్రియలో అంతర్భాగమేనని ఆయన అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు 2016 నవంబర్ 8న కేంద్రం ప్రకటన చేసింది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మొత్తం 58 పిటిషన్లు దాఖలయ్యాయి. 2016 డిసెంబర్ 16న అప్పటి సీజేఐ టీఎస్ ఠాకూర్ ఈ పిటిషన్ల విచారణను ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేశారు.