రద్దైన పెద్ద నోట్లను మార్చుకునే అవకాశం కల్పించాలని విడివిడిగా దాఖలయ్యే పిటిషన్లపై విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ విషయంలో పిటిషనర్లంతా ఒక రిప్రిజంటేషన్‌తో కేంద్రాన్ని సంప్రదించాలని న్యాయస్థానం సూచించింది. పిటిషనర్ల అభ్యర్థనలపై 12 వారాల్లోగా సమాధానమివ్వాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వం చెప్పే సమాధానంతో పిటిషనర్లు సంతృప్తి చెందని పక్షంలో అప్పుడు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం సూచించింది. అంతకు ముందు పెద్ద నోట్ల రద్దుపై దాఖలైన 58 పిటిషన్లను ఈ ఏడాది జనవరి 2న సుప్రీంకోర్టు కొట్టివేసింది.
పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదేనని తేల్చి చెప్పింది. ఆర్బీఐని సంప్రదించిన తర్వాతే కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుందని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. అందువల్ల కేంద్రం తీసుకున్న కార్యనిర్వాహక విధానాన్ని తాము తప్పుబట్టలేమని తేల్చి చెప్పింది.
ఇది ఇలా వుంటే తన దగ్గర రద్దైన రూ.65 వేల విలువైన పాత నోట్లు ఉన్నాయనంటూ తమిళనాడుకు చెందిన ఓ వృద్దుడు వాపోయాడు. తాను గత కొన్నేండ్లుగా యాచిస్తూ రూ. 65 వేల వరకు కూడ బెట్టానన్నాడు. ఆ నోట్లన్నీ రూ. 500, 1000 నోట్ల రూపంలోనే ఉన్నాయి. ఆ నోట్లను తీసుకెళ్లి బ్యాంకు అధికారులకు ఇచ్చాడు. కానీ ఆ నోట్లు చెల్లవు అని చెప్పేసరికి ఒక్కసారిగా అవాక్కయ్యాడు.