వర్షకాలం వచ్చిదంటే చాలు సీజనల్ వ్యాధులు ప్రబలుతూనే ఉంటాయి. అయితే.. ఓ వైపు కరోనా కేసులు ఎక్కువవుతుండగా, వాతవరణ మార్పులతో డెంగీ.. మలేరియా, వైరల్ ఫీవర్లతో ఆసుపత్రుల బాట పడుతున్నారు ప్రజలు. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. నీళ్లు నిలిచిపోవడం, డ్రైనేజీలు, చెత్తచెదారం, ఇతర వ్యర్థాలు నీళ్లలో కలవడం, దోమలు, కంపు, కలుషిత వాతావరణంతో వేల మంది విష జ్వరాల బారినపడ్తున్నారు.
రాష్ట్రంలో ఎడతెరిపిలేని వానలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు అధికంగా ప్రబలే అవకాశముందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే విషజ్వరాలు వేగంగా ప్రబలుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డెంగీ కేసులు అధికంగా వచ్చినట్లు చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 1184ల డెంగీ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. తెలంగాణలో టైఫాయిడ్ కేసులు కూడా అధికంగా నమోదవుతున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు అనేక రకాల వ్యాధులు ముంచుకొస్తుండటంతో.. మలేరియా నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని డీహెచ్ తెలిపారు. సీజనల్ వ్యాధుల కట్టడికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక సూచనలు చేసినట్లు చెప్పారు. నీళ్ల విరేచనాలకు సంబంధించి రాష్ట్రంలో 6వేల కేసులు నమోదైనట్లు డీహెచ్ వెల్లడించారు. కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల నీళ్ల విరేచనాలు కలుగుతాయని వివరించారు.
సీజన్ వ్యాధుల నేపథ్యంలో వ్యాధుల కట్టడి, సత్వర చికిత్స కోసం గ్రామస్థాయి నుంచి హైదరాబాద్ వరకూ ‘డిసీజ్ కంట్రోల్కమిటీ’లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఆరోగ్యశాఖ. రోగాలు ప్రబలుతున్న ప్రాంతాల్లో అధికారులు పర్యటించి, ఫీవర్ సర్వేలు నిర్వహించనున్నారు.