రాష్ట్రంలో డెంగ్యూ కేసులే లేవంటున్నారు వైద్యారోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్. వచ్చీరాగానే కేటీఆర్ విష జ్వరాలపై దెప్పి పొడిచినందుకో ఏమో రాష్ట్రంలో జ్వరాల తీవ్రతను తెలుసుకునేందుకు రాజేందర్ జిల్లాలకు బయల్దేరారు. సర్కారు దవాఖానాల్లో పరిస్థితులు ఎలా వున్నాయో పరిశీలించుకుంటూ తిరుగుతున్నారు. అంతా బానే వుంది కానీ, డెంగ్యూ పెద్దగా లేదని చెప్పడమే ప్రజాగ్రహానికి కారణం అవుతోంది. మినిస్టర్ గారూ.. ఇదిగో గాంధీ ఆస్పత్రిలో డెంగ్యూతో ఒకరు మరణించారు.. మీకు కనిపించడం లేదా? కావాలంటే ఇదిగో చూడండంటూ సాక్షాత్తూ జర్నలిస్టులే సాక్ష్యాలు చూపించాల్సిన పరిస్థితి !
హైదరాబాద్: రాష్ట్రంలో డెంగ్యూ తీవ్రత అంతగా లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అంటుంటే మరోపక్క సోషల్ మీడియాలో నెటిజన్లు ‘మా ఏరియాకి రండి.. చూపిస్తామ’ని విరుచుకుపడుతున్నారు. తెలంగాణలో ఇప్పుడున్న జ్వరాల్లో 99 శాతం వైరల్ ఫీవర్లే తప్ప, మీడియా రాస్తున్నట్టు అవి డెంగ్యూ కేసులు కావని మంత్రి వివరణ.
ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని పలు వార్డులను మంత్రి ఈటల స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులపై అధికారులతో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, అసలు ఎక్కడా డెంగ్యూ తీవ్రత లేనే లేదని అన్నారు.
దీనిపై తెలంగాణకు చెందిన ఒక సీనియర్ జర్నలిస్టు బాహాటంగా తన అభ్యంతరాన్ని తెలిపారు. ‘ఇదిగో ఈ డెత్ సర్టిఫికెట్ చూడండి.. దీన్నేమంటారు’ అంటూ సోషల్ మీడియాలో నిలదీశారు. నగరంలోని కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన 35 సంవత్సరాల ప్రవీణ్ కుమార్ సికిందరాబాద్ ఆసుపత్రిలో డెంగ్యూ కారణంగా చనిపోయాడని మరణ ధృవీకరణ పత్రంలో స్పష్టంగా వుంటే, వైద్య మంత్రి డెంగ్యూ మరణాలే లేవని పేర్కొనడం దారుణమని అంటున్నారు.