కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీలో సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఆంక్షలను సడలించింది. పాఠశాలలను దశల వారీగా తెరిచేందుకు నిర్ణయించింది. కరోనా సమస్య వదులుతోంది అనుకున్న సమయంలో పొగమంచు ఢిల్లీ వాసులను తెగ ఇబ్బంది పెడుతోంది.
ఢిల్లీని దట్టమైన పొగమంచు కప్పేసింది. పక్కన ఉన్న మనిషే కనిపించనంతగా పొగమంచు కనిపించింది. ఐఎండీ లెక్కల ప్రకారం దేశ రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. ఎయిర్ పోర్టులో మంచు కారణంగా ఉదయం సమయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఉదయం వేళలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. పొగమంచు కారణంగా ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయో అని కాలు బయటకు పెట్టడం లేదు. ఇటు గాలి నాణ్యత కూడా పడిపోయినట్లు నిపుణులు చెబుతున్నారు. చలిగాలుల తీవ్రత కూడా ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు.
ఒక్క ఢిల్లీలోనే కాదు.. పంజాబ్, రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది.