ఝార్ఖండ్ రోప్ వే కేబుల్ కార్లలో చిక్కుకున్న పర్యాటకులను వెలికితీసే క్రమంలో ప్రమాదవశాత్తూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది పర్యాటకులను భారత వాయుసేన మంగళవారం కాపాడింది.ఇప్పటి వరకు సుమారు 50 మందిని కాపాడినట్టు ప్రభుత్వం ప్రకటించింది.కేబుల్ కార్లలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెండు రోజులుగా అధికారులు శ్రమిస్తున్నారు.
రెస్క్యూ ఆపరేషన్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తోపాటు ఆర్మీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు పనిచేస్తు్న్నాయని అధికారులు తెలిపారు. కేబుల్ కార్లలో చిక్కుకున్న వారికి ఆహారం అందించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నట్టు అధికారులు చెప్పారు.
ఝార్ఖండ్,దియోగడ్ జిల్లాలో సోమవారం రోప్ వే ప్రమాదం చోటు చేసుకుంది.శ్రీ రామనవమి సందర్భంగా పర్యాటకులు త్రికూట పర్వతానికి దర్శనం కోసం వెళ్లారు. పర్వతంపైకి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో పర్యాటకులు రోప్ వేలో వెళ్లారు.
ఆ సమయంలో రెండు కేబుల్ కార్లు ఒక దానితో ఒకటి ఢీ కొన్నాయి. దీంతో కేబుల్ వైర్లు తెగి ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఇద్దరు పర్యాటకులు మరణించారు. సమాచారం అందుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఆ తర్వాత కేబుల్ కారు నుంచి ఒక్క పర్యాటకుడిని రక్షించే ప్రయత్నంలో అతను పట్టు తప్పి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు