బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. వాయుగుండం అసని తుఫాన్ గా మారి తీవ్ర రూపం దాల్చనుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మార్చి 22 ఉదయం నాటికి బంగ్లాదేశ్ చేరుకోనుందని వెల్లడించింది. తర్వాత ఉత్తర మయన్మార్ తీరానికి మార్చి 23న చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు యానాం, అండమాన్ నికోబార్ దీవులలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని స్పష్టం చేశారు అధికారులు. దక్షిణ బంగాళాఖాతంలో మార్చి 16న ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చి.. ప్రస్తుతం వాయుగుండం అసని తుఫాన్ గా మారిందని తెలిపారు.
వేసవికాలం ప్రారంభంలోనే భానుడి భగభగలకు మండిపోతున్న భాగ్యనగర వాసులు నిన్న కురిసిన చిరుజల్లులతో సేదతీరారు. తెలంగాణలోని పలు చోట్ల వర్షాలు పడడంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. వర్షాల నేపథ్యంలో ఉష్ణోగ్రత 40 కిందకి దిగొచ్చింది. అయినా పగటి పూట వేడి అధికంగా ఉంటుంటే, సాయంత్రానికి చిరుజల్లులు పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.
ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మిర్యాలగూడలో పగటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర తగ్గాయి. రామగుండంలో ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలకు పడిపోయింది. ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.