బోటు ప్రమాదంలో మృతుల జాడ పూర్తిగా తెలియనే లేదు. మంత్రులందరూ బిజీగా వున్నారు. ఒక్కరు కూడా ఆ ఛాయలకు పోవడం లేదు. ‘ప్రభుత్వం చేతులెత్తేసింది.. మీరైనా న్యాయం చేయండి..’ అంటూ ప్రమాద బాధితులు కోర్టును కోరుతూ రాజమహేంద్రవరంలో బ్యానర్లు కట్టారు. ఈ కష్టాలూ కన్నీళ్లు.. సమస్యలకు దూరంగా ఎక్కడో అటవీ ప్రాంతంలో వైసీపీ మంత్రులు పచ్చని అడవుల్లో మకాం పెట్టి ఎంచక్కా సిన్మా తీసుకుంటున్నారు.
ఇది రియల్
ఇది రీల్
గోదాట్లో మునిగిన బోటు, దాంట్లో చిక్కుకున్న మృతదేహాలు కాలం కలిసొస్తే పైకి తేలచ్చు. లేకపోతే.. లేదు, అంతే ! బోటు వెలికి తీయడం మాత్రం మావల్ల కాదంటూ ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసింది. బోటు ఎక్కిన వారి సంఖ్య బయటికొస్తుందనే భయంతోనే ప్రస్తుతానికి వెలికితీత ప్రక్రియ నిలిచిపోయిందనే కామెంట్ మరోపక్క వినిపిస్తోంది. ఇలావుంటే, ఇప్పుడు గోదావరి ప్రమాదం కంటే మునిగిపోయే పనులు ప్రభుత్వానికి చాలా వున్నాయ్. ఓపక్క పొరుగు రాష్ట్రానికి ఇక్కడి నుంచి గోదావరి నీళ్లు ఎలా ఇవ్వాలా అని రాష్ట్రాధినేత తీవ్రంగా ఆలోచించి దీనిపై చర్చలు జరపడానికి హైదరాబాద్ వెళ్తున్నారు. మరోపక్క మంత్రులు కూడా ఎవరికి వారు చాలా బిజీగా వున్నారు.
ఎంత బిజీగా వున్నారంటే, డిప్యూటీ ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‌లో బిజీ షెడ్యూల్‌లో వున్నారు. ‘అమృతభూమి’ అనే సినిమాలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి నటిస్తున్నారు. ఆ మూవీలో డిప్యూటీ సీఎం టీచర్ పాత్ర చేస్తున్నారు. ఆ పాత్రలో పాముల పుష్పశ్రీవాణి ఒదిగిపోయారని చుట్టుపక్కల వున్న జిల్లా అధికార యంత్రాంగం అభినందనలు కురిపిస్తున్నారు. అన్నట్టు ఇదే మూవీలో కలెక్టర్ హరి జవహర్‌లాల్ అధికారి పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఎవరెవరు ఈ మూవీలో నటిస్తున్నారో చిత్ర యూనిట్ వివరంగా ఒక ప్రెస్ మీట్ పెడితే తప్ప తెలియదు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఈ సినిమా తీస్తున్నారని సమాచారం. గొరడలో ఈ చిత్రం తాలూకు చిత్రీకరణ జరుగుతోంది. ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యం తెలిపేలా ‘అమృత భూమి’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రజల్లో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘అంత బాగానే వుంది కానీ.. ప్రకృతి వ్యవసాయం కాపీరైట్ చంద్రబాబుది కదా.. మరి చంద్రబాబు బ్రాండ్‌ను పుష్పశ్రీవాణి ఎందుకు ప్రమోట్ చేస్తున్నట్టు? మేటర్ తెలిస్తే బహుశా షూటింగ్ క్యాన్సిల్ అంటారేమో మంత్రి గారు..’ అని జనం అనుకుంటున్నారు.
ఇలావుంటే, సీనియర్ నటుడు ప్రసాద్‌బాబు, టీవీ ఆర్టిస్ట్ దయాబాబు, లక్ష్మి, స్వప్న, రమేష్ ఈ చిత్రీకరణలో పాల్గొనడానికి ఈ ప్రాంతానికి వచ్చారు. సినిమా షూటింగ్ సందడితో గిరిజనులంతా పులకించిపోతున్నారు. మరోపక్క గోదావరిలో మృతదేహాలు బయటికి తీసేంతవరకు పచ్చి గంగైనా ముట్టమని అక్కడి చుట్టుపక్కల 10 గ్రామాల్లోని గిరిజనులు భీష్మించుకుని కూర్చున్నారు.