తండ్రి స్థానంలో పోటీకి సిద్దం అయిన జానారెడ్డి వారసులు
రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రకటించారు.. అనే ప్రచారం నిజమేనా..?
సాగర్ నుండి ఒకరు.. ఇంకొకరు ఎక్కడినుండి..?
రేవంత్ తో వరస బేటీలు.. ఫలించేనా..?
జిల్లాలో యాక్టివ్ అయిన జానారెడ్డి తనయులు
ఆస్తిపాస్తులకు వారసులను ప్రకటించినట్టు.. రాజకీయాన్ని కూడా వారసత్వంగా ప్రకటించుకుంటున్నారు నాయకులు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రాష్ట్ర రాజకీయాల్లో జానారెడ్డి వారసులు దూకుడు పెంచారు. ఇంతకాలం తండ్రికి వెనుక ఉంటూ పనిచేస్తూ వచ్చిన రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డిలు ఇప్పుడు పోలిటికల్ స్క్రీన్ పై కనిపించడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే నాగార్జున సాగర్ ఉపఎన్నికలో తాను ఇంకా పోటీ చేయనని జానారెడ్డి చెప్పారో.. అప్పటినుంచే ఆయన వారసులు దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. అప్పుడు.. ఆ ఉపఎన్నికలోనే తండ్రి స్థానంలో వారసులు పోటీ చేస్తారని ప్రచారం జోరుగా జరిగింది. కానీ.. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం జానారెడ్డినే డైరక్ట్ గా బరిలో దిగాలని కోరడంతో.. జానారెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అయితే.. వచ్చే ఎన్నికల్లో మాత్రం జానారెడ్డి పోటీ చేయడం కష్టమని తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు వయసు మీద పడింది. కాబట్టి యాక్టివ్ గా ప్రజల్లో తిరగకపోవచ్చు. అందుకే.. ఆయన పోటీ నుంచి తప్పుకొని.. ఆ స్థానంలో తన వారసులను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు వారసులు నల్గొండ జిల్లాలో దూకుడుగా పనిచేస్తున్నారు. పైగా ఇటీవల ఆ ఇద్దరు.. ఒకరి తర్వాత ఒకరు వరుసపెట్టి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇక ఈ భేటీ సీట్ల గురించే కావచ్చు అని.. జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం జానారెడ్డి ఫ్యామిలీ చేతిలో ఒక్క సీటు మాత్రమే ఉంది. అది కూడా నాగార్జున సాగర్ మాత్రమే. అంటే.. ఇద్దరు వారసుల్లో ఒకరికి మాత్రమే పోటీ చేయడానికి అవకాశం ఉంది. దీంతో జానారెడ్డి తన మరో వారసుడుకి మిర్యాలగూడ సీటుని కూడా లైన్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల అక్కడ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు జానారెడ్డి.
పైగా మిర్యాలగూడలో రఘువీర్ రెడ్డి యాక్టివ్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడంతో పాటు.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటు.. ఇదే తరహాలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జయవీర్ రెడ్డి దూకుడు పెంచారు. ప్రతీ కార్యకర్తను కలుస్తున్నారు. అంటే రెండు సీట్లలో పోటీకి జానారెడ్డి వారసులు రెడీ అయిపోయారని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. కానీ.. నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానంలో టికెట్ లభిస్తుండొచ్చు కానీ.. మిర్యాలగూడ సీటును టీపీసీసీ అధ్యక్షలు రేవంత్ రెడ్డి ఎవరికి కేటాయిస్తారు అనేది వేచి చూడక తప్పదని అంటున్నారు కాంగ్రెస్ పెద్దలు.