అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల టెక్సాస్ లోని ఓ పాఠశాలలో దుండగుడు కాల్పులు జరపగా 19 మంది చిన్నారులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన మరోసారి గన్ కల్చర్ పై అగ్రరాజ్యంలో చర్చకు దారి తీసింది.
ప్రధానంగా అమెరికాలో గన్ కల్చర్ పై అమెరికా బాలల రక్షణ నిధి సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఇటీవల గన్ వాయలెన్స్ కారణంగా ఎక్కువ మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోందని పేర్కొంది.
ప్రతి రెండున్నర గంటలకు ఒక హత్య…!
అమెరికాలో ప్రతి రోజు పిల్లలపై 9 వరకు కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, దాని వల్ల ప్రతి 2 గంటల 36నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నట్టు భయాందోళనలు వ్యక్తం చేసింది.
ఇతర దేశాలతో పోలిస్తే …..
అధిక ఆదాయం పొందుతున్న దేశాల్లో చూస్తే అమెరికాలోనే కాల్పుల ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఆయా దేశాలతో పోలిస్తే తుపాకీ కాల్పుల వల్ల పిల్లల మరణాల సంఖ్య అమెరికాలో 36.5 రెట్లు ఎక్కువగా ఉందని సంస్థ పేర్కొంది.
యూరోపియన్ దేశాల్లో అధిక గన్ లైసెన్లు
అమెరికా తర్వాత యూరోపియన్ దేశాల్లో ప్రజలు అధికంగా గన్ లైసెన్లు కలిగి వున్నారు. ముఖ్యంగా ఫిన్లాండ్, నార్వేల్లో అత్యధికులకు గన్ లైసెన్లు ఉన్నాయి. అయినప్పటికీ ప్రపంచంలో అత్యంత రక్షణ కల దేశాల జాబితాలో అవి నిలుస్తున్నాయి.
సామాజిక అంశాలు..
గన్ కల్చర్ ను తగ్గించడంలో సామాజిక అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని గన్ రీసెర్చర్స్ చెబుతున్నారు. ముఖ్యంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త చట్టాలను తీసుకు వస్తే నేరాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఒక దేశంలో ఉండే పోలీసింగ్ వ్యవస్థ, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, రాజకీయ నాయకుల జవాబుదారి తనం, సంక్షేమ, రక్షణ వ్యస్థలు, విద్యా వ్యవస్థ వంటివి గన్ కల్చర్ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరిస్తున్నారు.