హిమాలయాలు, వన్యప్రాణులు, ఆధ్యాత్మికత, వారసత్వం, ఈశాన్య ప్రాంతాలకు సంబంధించిన వివిధ రకాల పర్యాటకాన్ని భారతదేశం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేశంలోని పర్యాటక ప్రదేశాలు విస్మరించబడ్డాయన్నారు.
బడ్జెట్-2023 ప్రకటనలను సమర్థవంతంగా అమలు చేసేందుకు సూచనలను ఆహ్వానిస్తూ ప్రభుత్వం 12 భాగాల బడ్జెట్ అనంతర వెబినార్లు నిర్వహిస్తోంది. ఈ రోజు ‘టూరిజం డెవలప్ మెంట్ ఇన్ మిషన్ మోడ్’ అనే శీర్షికన వెబినార్ నిర్వహించారు. అందులో ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు వర్చువల్ గా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. టూరిజం రంగంలో ఉపాధి, పెట్టుబడి అవకాశాలను సృష్టించడం బడ్జెట్ 2023 లక్ష్యమని ఆయన వివరించారు. పునరుద్ధరించిన కాశీ విశ్వనాథ్ ధామ్‌ను 7 కోట్ల మంది సందర్శించారన్నారు. కేదార్‌నాథ్ ను 15 లక్షల మంది, స్టాట్యూ ఆఫ్ యూనిటీని 27 లక్షల మంది పర్యాటకులు సందర్శించారని చెప్పారు.
మరిన్ని సౌకర్యాలు, ప్రయాణ సౌలభ్యాన్ని కల్పించడం వల్ల పర్యాటకం మరింత వృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. టూరిజం అనేది అధిక ఆదాయాన్ని ఆర్జించే వ్యక్తుల కోసం ఉద్దేశించిన ‘ఫ్యాన్సీ పదం’అని కొందరు భావిస్తున్నప్పటికీ, దేశంలో అది సామాజిక-సాంస్కృతిక నేపథ్యాన్ని కలిగి ఉందన్నారు.
డెస్టినేషన్ వెడ్డింగ్‌ల కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారు కూడా ఇలాంటి ఇంటర్ కల్చరల్ వెడ్డింగ్ ఫంక్షన్‌లను ఎంచుకుంటుండటంతో పర్యాటక రంగానికి భారీగా అవకాశాలు వస్తాయన్నారు.
పర్యాటక శాఖ తన యాప్ లను ఆధునీకరించే విషయంపై ఫోకస్ చేయాలని ఆయన సూచించారు. దేశంలోని అన్ని భాషల్లో యాప్ ను యాక్సెస్ చేసుకునేలా తీర్చి దిద్దాలన్నానరు. పర్యాటక ప్రాంతాల్లో బహుళ భాషల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని, అక్కడ డిజిటల్ కనెక్టివిటీని ఏర్పాటు చేయాలన్నారు.