ఏం చేసినా వినూత్నంగా చేస్తాడు విజయ్ దేవరకొండ. తన ప్రతి పుట్టినరోజుకు ఫ్రీగా ఐస్ క్రీమ్స్ ఇస్తుంటాడు. చాలామందికి దుస్తులు, గ్యాడ్జెట్స్ ఇచ్చాడు. ఇప్పుడు అలాంటిదే మరో ప్రయత్నం చేశాడు ఈ హీరో.
ప్రతి సంవత్సరం దేవర సాంటా గా మారి తన అభిమానులకి సంతోషాన్ని పంచే విజయ్ ఈ సంవత్సరం 100 మందికి జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలు అందించాడు.
తన స్నేహితులతో చిన్నప్పుడు ట్రిప్ కి వెళ్లిన స్మృతులని గుర్తుచేసుకుంటూ తన దగ్గర సరైన సంపాదన లేనప్పుడు ఆ ట్రిప్ కి తన స్నేహితులు తనని తీసుకెళ్లడం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపాడు విజయ్ దేవరకొండ.
అలాంటి సంతోషాన్ని పంచాలనే ఉద్దేశంతో, ఎంపిక చేసిన 100 మంది సామాన్యులని తన సొంత ఖర్చుతో మనాలి ట్రిప్ కి తీసుకెళ్లాడు. వాళ్లతో పాటు, తను కూడా వెళ్లాడు. వెంట తల్లిదండ్రుల్ని తీసుకెళ్లాడు.
తాజాగా ఆ ట్రిప్ కి సంబంధించిన గ్లింప్స్ ని విజయ్ తన హ్యాండిల్ లో పోస్ట్ చేశాడు. అందరూ ఎంతో ఉల్లాసంగా గడిపారు. విజయ్ మీద తన ప్రేమను చాటుకున్నారు. చివర్లో అందరూ ఎమోషనల్ అయి విజయ్ ని హగ్ చేసుకోవడం ఆ 100 మంది ఒకరికొకరు ఎమోషనల్ గా దగ్గరవ్వడం ఈ వీడియోలో చూపించారు.