ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది. ఓ సినిమా హిట్ అయితే దానికి తగినట్లు మరో కథ రాసి సినిమా తీసేస్తున్నారు. గతంలో సీక్వెల్ సినిమాలు భారీ హిట్లు కొట్టడంతో స్టార్ హీరోలు, డైరక్టర్లు సైతం వీటిపై దృష్టిపెట్టారు. మన దగ్గర వీటి ధోరణి తక్కువే.. కానీ హాలీవుడ్‌లో సంవత్సరం పొడుగునా సీక్వెల్స్, ఫ్రాంఛైజీలు అభిమానులను పలకరిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం తెలుగులోనూ వీటి జోరు బాగా పెరిగింది. గతంలో రాజమౌళి ‘బాహుబలి : ద బిగినింగ్’ అనే చిత్రం తీసి అందులోని ట్విస్ట్ ఆధారంగా భారీ పబ్లిసిటీ చేశారు. అలా ‘బాహుబలి : ద కంక్లూషన్’ మూవీతో రికార్డులు తిరగ రాశారు.
ఇదే జోరును మిగతా హీరోలు, డైరెక్టులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సోగ్గాడే చిన్నినాయన’తో హిట్ కొట్టిన నాగార్జున.. దానికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక, వెంకటేశ్, వరుణ్‌తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం ‘ఎఫ్2’ మూవీకి సీక్వెల్‌గా ‘ఎఫ్3’ తీస్తున్నారు. అలాగే, ‘కార్తికేయ’కు కొనసాగింపుగా ‘కార్తికేయ2’, విశ్వక్‌సేన్ ‘హిట్’, అడవి శేష్ ‘గూఢాచారి’ సినిమాలకు సీక్వెల్స్ సిద్ధమవుతున్నాయి. రిసెంట్‌గా వచ్చిన ‘పుష్ప’కు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు ఆ చిత్ర బృందం.
అయితే, కాసేపు వాటి సంగతి పక్కన పెడితే.. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ కీర్తి పతాకాన్ని ఎగరేశారు దర్శకదీరుడు రాజమౌళి. 2.30 గంటల్లో కథను పూర్తిగా చెప్పలేనని భావించిన జక్కన చిత్రీకరణ సమయంలోనే రెండు భాగాలుంటుందని ప్రకటించారు. అలా ‘బాహుబలి ది బిగినింగ్’, ‘బాహుబలి ది కన్‌క్లూజన్’ సినిమాలతో ప్రేక్షకులకు కనులపండగను అందించారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఈ రెండు సినిమాలు కలిపి రూ.2వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి.
బహుబలి సినిమాతో ప్రపంచ ప్రేక్షకుల చేత ఔరా అనిపించుకున్న రాజమౌళి.. ఈ సినిమాకి మరో సీక్వెల్ తీయనున్నారు. బాహుబలి అద్భుతమైన రీతిలో సక్సెస్ అయ్యాక దానికి సీక్వెల్‌గా బాహుబలి 2 తీసుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా బాహుబలి 3 కి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో బాహుబలి 3పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి చిత్రానికి కొనసాగింపుగా మరో చిత్రం రానుందా.? అన్న ప్రశ్నకు జక్కన్న స్పందిస్తూ ‘తప్పకుండా రొవొచ్చు’ అనే సమాధానం ఇచ్చారు. అయితే, దీనికి ఇంకా కొద్దీ రోజులు సమయం పడుతుందని తెలిపారు. తాజాగా బహుబలి నిర్మాత ప్రసాద్ దేవినేని కూడా ఓ ఇంటర్వ్యూలో బహుబలి-3 మూవీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగానే సమాధానం ఇచ్చారు. దీంతో సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బహుబలి-3 ద్వారా ప్రేక్షకులకు బాహుబలి చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు చెప్పే స్కోప్ ఉందని.. ఎస్ఎస్ రాజమౌళి చెబుతున్నారని ప్రసాద్ దేవినేని అన్నారు. అయితే, వెంటనే దీనిని ప్రారంభించాలని అనుకోవటం లేదని, ఎందుకంటే రాజమౌళికి ప్రస్తుతం రెండు కమిట్‌మెంట్లు ఉన్నాయని అన్నారు. జక్కన్న ప్రస్తుతం మహేశ్ బాబు చిత్రంపై దృష్టి పెట్టారని చెప్పారు. బహుబలి సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా మహేశ్ బాబు సినిమా పూర్తి అయ్యాక ఆలోచిందామని చెప్పారని అన్నారు. అది పూర్తి అయ్యాక.. అన్ని సరిగ్గా జరిగితే బహుబలి-3 వస్తుందని నిర్మాత ప్రసాద్ దేవినేని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.