ఇంద్రకీలాద్రి ఉత్సవాల్లో వంద రూపాయలు టిక్కెట్లకు కూడా కక్కుర్తి పడి వీఐపీ ముద్రలు వేసి అమ్ముకుంటున్నారని, ఏ మంత్రి అండదండలతో ఇదంతా జరుగుతోందో తేల్చాలని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా అన్నారు. ఈసారి కొండపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడూ లేనంతగా రాజకీయమయమై పోయాయని ఉమా ఆరోపించారు. ఈసారి ఉమా క్యూలైన్‌లో నడుచుకుంటూ వచ్చి దుర్గమ్మను దర్శనం చేసుకున్నారు.
విజయవాడ: ఈసారి అధికార పార్టీ నేతల హడావుడే ఎక్కువగా కనిపిస్తోందని, ఫ్లెక్సీలు ఎక్కువ పని తక్కువ అన్నట్లుగా వీరి పని ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం చేసుకున్న తరువాత ఉమా మీడియాతో మాట్లాడారు. కొండ మీద అమ్మవారి దర్శనం టిక్కెట్లను కూడా రీసైక్లింగ్ చేస్తున్నారని ఉమా ఈ సందర్భంగా ఆరోపించారు. అధికార పార్టీ నేతల సేవలో పోలీసులు తరిస్తున్నారని, స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చిన వలంటీర్లను తరిమికొట్టారని దుయ్యబట్టారు. మూడు వందలు టిక్కెట్ కొన్నవారు మాత్రం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఇక్కడుందని అన్నారు. అధికార పార్టీ నేతలు మాత్రం రాజమార్గంలో వెళుతున్నారని, తమ హయాంలో గడచిన ఐదేళ్లలో ఆలయాల దగ్గర ఇలా విచ్చలవిడితనం లేదని అన్నారు. ప్రజల ఆదాయాలు తగ్గిపోయి.. రోజు గడవటమే కష్టంగా ఉందని ఉమా చెప్పారు. ఇసుక కొరతతో అన్ని వర్గాల్లోనూ ఉపాధి లేకుండా పోయిందని అన్నారు.
‘పనులు లేవు.. డబ్బులు లేవు..అందుకే ఈసారి దసరా ఉత్సవాలకు భక్తుల సంఖ్య తగ్గింది.. నేతల సంఖ్య పెరిగింది.. చేసిన పాపాల్ని కడుక్కోడానికి గుడులకు వస్తున్నారు..’ అని ఉమా అన్నారు. అన్న ప్రసాదంలో నాణ్యత పెంచాలని తనకు భక్తులు చెప్పారని, దాతలు ఇచ్చిన సొమ్ము అరవై కోట్లు ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఆ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో మంచి భోజనం పెట్టవచ్చునని చెప్పారు. కనకదుర్గమ్మ గుడి ఫ్లైఓవర్ పనులు రెండు, మూడు మాసాల్లో పూర్తిచేస్తానని చెప్పుకున్న జగన్ సర్కార్ ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు.
ఈరోజు ఇక్కడ ఆలయంలో లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్రాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడాలని కోరుకున్నానని తెలిపారు.