రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తుంటే కరోనా ప్రభావం ఏపీలో లేదంటున్నారని మండిపడ్డారు. కరోనా వైరస్ పై సీఎం బాధ్యతరహితంగా మాట్లాడుతున్నాడని.. కరోనా బాధితులకు పారాసిటమాల్ టాబ్లెట్ వేస్తే తగ్గిపోతుందని చెప్పడం అవివేకమన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు కరోనా వైరస్ నివారణకు చర్యలు తీసుకుంటుంటే.. ముఖ్యమంత్రిననే బాధ్యతను మరిచి అవాస్తవాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు దేవినేని ఉమా.
జగన్ మోహన్ రెడ్డి ఒక నియంత వ్యవహరిస్తున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషనర్ కు కులాన్ని అంటగట్టి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. శాంతి భద్రతల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించిన ఎన్నికల కమిషనర్ ఆదేశాలను ఎందుకు పాటించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో శాంతి భద్రతలు క్షిణిస్తున్నాయని.. డీజీపీ అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను వైసీపీ కార్యకర్తలు భయాందోళనకు గురి చేస్తోన్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపంచారు.