దేశవ్యాప్తంగా లాక్ డౌన్ లో ఉంటే రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను సిఆర్డిఏ రూల్స్ మార్చి 1250 ఎకరాలు మీ పార్టీకి కార్యకర్తలకు ఇచ్చే ఏర్పాటు చేస్తారా అంటూ ప్రశ్నించాడు మాజీ మంత్రి దేవినేని ఉమా. ధాన్యం బస్తా 850 నుండి 900 రూపాయలకు దళారులు దోచేస్తూ ఉంటే సివిల్ సప్లైస్ మంత్రి కొడాలి నాని ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే ఆక్వా రైతు ఫీడు దొరకక బాధపడుతూ ఉంటే రైతుకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం దళారుల కోసం వారికి కొమ్ము కాస్తూ రైతులను పట్టించుకోటం లేదని ఆరోపించారు. 80, 90, 100 కౌంట్ ఉన్న రొయ్యలను 250 రూపాయిలకు రైతులు అమ్మితే నేడు 80 రూపాయలకు కూడా కొనే దిక్కులేదు.టమాటా, బొప్పాయి, మామిడి, మల్లె రైతులు పండిన పంటలను ఏమి చేయాలో అర్థం కాక ఏడుస్తుంటే మీ మంత్రులు, అధికారులు ఏం చేస్తున్నారనిమండిపడ్డారు. రైతులు పండించిన పంటను తరలించడానికి ట్రాన్స్పోర్ట్ వెహికల్ దోరకడం లేదు కానీ.. వైసిపి నాయకులు ఇసుక తరలించడానికి వందలాది లారీలు ఎలా వస్తున్నాయని నిలదీశారు ఉమా.
హైకోర్టు ఆదేశించినా ఆపత్కాలంలో సేవలు చేస్తున్న వైద్య సిబ్బందికి అవసరమైన మాస్కులు గాని, శానిటైజర్లు ఎందుకు ఇవ్వలేక పోతున్నారని ప్రశ్నించారు. రెవెన్యూ యంత్రాంగం తో మూడు జిల్లాలలో హుద్ హుద్, తితిలి తుఫాన్ సమయాలలో ప్రజలందరికీ ఉచితంగా నిత్యావసరాల పంపిణీ చేశాం.. రౌతును బట్టే గుర్రం నడుస్తుంది.ముఖ్యమంత్రి జగన్ తన చేతగానితనం, అమాయకత్వం, తెలియని తనం వల్ల రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఆదేశించినా ఉపాధిహామీ కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా రైతు కూలీల ఉసురు తీస్తున్నారు. చంద్రబాబు నాయుడు సూచించినట్టు ప్రతి కుటుంబానికి 5 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 106 రోజులుగా ఉద్యమం చేస్తున్న అమరావతి రైతుల గురించి ముఖ్యమంత్రి ఈరోజుకి కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాస్తవ పరిస్థితులను తెలియజేయ వలసిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్ కు లేదా.. రికార్డ్ వీడియోలు కాకుండా మీడియా ముందుకు వచ్చి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.