కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. అయితే కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ఆన్లైన్ ద్వారా రూ. 300 లతో ప్రత్యేక దర్శనం, ఆన్లైన్ లోనే సర్వదర్శనం టిక్కెట్లు, తిరుమల తిరుపతి స్థానికులకు టీటీడీ దర్శన భాగ్యం కల్పించింది.
శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకొనేందుకు ఎంతో భక్తి భావంతో వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఏర్పాట్లు అసలు బాగాలేదని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నామన్న టీటీడీ అధికారులు.. సామాన్య భక్తుల ఏర్పాట్లు గాల్లో వదిలేసి వీఐపీల సేవలకు పరిమితం అయ్యారని భక్తులు వాపోయారు.
ఇక కొందరు భక్తులు టీటీడీ అధికారులపై తీవ్రంగా మండి పడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కంపార్ట్మెంట్లో కూర్చో బెట్టి రాత్రి ఎనిమిది గంటలకు స్వామి వారి దర్శనంకు వదిలారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వామి వారి దర్శనం చేసుకోకుండా అధికారుల తీరుతో బయటకు వెళ్తున్న భక్తులను టీటీడీ సిబ్బంది సద్ది చేప్పి స్వామి వారి దర్శనంకు పంపారు. అయితే స్వామి వారి దర్శనం తర్వాత ఆలయ బయటకు వచ్చిన భక్తులు.. ఒక్కసారిగా టీటీడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.
అయితే.. విజిలెన్స్ సిబ్బంది భక్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా భక్తులు వినిపించుకోలేదు. టీటీడీ అధికారులు, పోలీసుల తీరుపై భక్తులు తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామని చెప్పిన టీటీడీ.. వీవీఐపీల సేవలో తరించి సామాన్య భక్తుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.