బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఆదివారం భక్తులతో ఇంద్ర కీలాద్రి కిటకిటలాడింది. మూలా నక్షత్రం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. శరన్నవరాత్రుల్లో భాగంగా ఆదివారం కనక దుర్గమ్మ సరస్వతి దేవీగా దర్శనమిచ్చారు. దీంతో వినాయకగుడి నుండి చిన్న రాజగోపురం వరకు భక్తులతో క్యూ లైన్స్ కిక్కిరిసిపోయాయి. అందులోనూ అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ అధికారులు, పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ఆదివారం కనక దుర్గమ్మ మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్మనమిచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ దుర్గమ్మను దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 3 గంటలకే ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సమయంలో దర్శనాలను నిలిపివేయగా.. భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల తరబడి లైన్లలోనే ఉంటూ దర్శనం కోసం పడిగాపులు పడ్డారు.
ఓంకారం మలుపు కిందకు ఉన్న క్యూలైన్‌లలో భక్తులను అధికారులు నిలిపివేయడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. కొందరు పిల్లలు దాహంతో అల్లాడిపోయారు. దగ్గరలోని వాలంటీర్లు అప్రమత్తమై వారికి మంచినీళ్ల ప్యాకెట్లు అందజేశారు. దీంతో భక్తులు ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈవోకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ముఖ్యమంత్రి దర్శనానంతరం కొండపై నుంచి కిందికి వెళ్తున్న సమయంలో ఘాట్ రోడ్డు రాజగోపురం పాయింట్ వద్ద క్యూలైన్‌లలో ఉన్న కొందరు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదించారు. జై జనసేన జై పవన్ అంటూ నినాదాలు చేశారు. సీఎం జగన్ వెనక్కి చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.