వేసవి సెలవులు ముగుస్తున్న క్రమంలో తిరుమలలో భక్తులు పోటెత్తారు. దీంతో రద్దీ బాగా పెరిగింది. స్వామి వారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. మరో వైపు ఈ రోజు తెల్లవారుజాము నుంచే 29 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు.
మరో వైపు బుధవారం ఒక్క రోజే స్వామిని 74,995 మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.దీంతో ఆలయం హుండీ ఆదాయం కూడా బాగా పెరిగింది. ఒక్క రోజే 3.60 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అదే విధంగా 38,663 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
అయితే వేసవి సెలవులు కావడంతో వీకెండ్ లో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. దీంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వీఐపీ బ్రేక్ ముగిసిన తర్వాత సర్వదర్శన భక్తులకు వేగంగా దర్శనం కల్పించడంతో సాయంత్రానికి లైన్ నారాయణగిరి ఉద్యానవన షెడ్లకు చేరుకుంటుంది.
అయితే వీరికి దాదాపుగా 20 గంటల దర్శన సమయం పడుతోంది. టైంస్లాట్ టిక్కెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు రెండు నుంచి మూడు గంటల దర్శన సమయం పడుతోంది. మరో వైపు తిరుమలలో గదులకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. దాదాపు 3 గంటల తర్వాత కాని గది దొరకడం లేదు.