– లక్షన్నరకు పైగా భక్తులు.. కనీస ఏర్పాట్లు కరువు
– కిక్కిరిసిన వేయిస్తంభాల రుద్రేశ్వరుడి ఆలయం
– వాహనాలకు పార్కింగ్ లేక అనేక ఇబ్బందులు
– అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటున్న భక్తులు
రాష్ట్రంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. భక్తులు భారీగా ఆలయాలకు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అయితే.. పలు ఆలయాలలో దర్శనానికి వచ్చిన భక్తులకు కనీస వసతులు లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా రుద్రేశ్వరుడిని దర్శించుకునేందుకు వేయిస్తంభాల ఆలయానికి వచ్చిన భక్తులకు అగచాట్లు తప్పలేదు.
ప్రతీ ఏటా శివరాత్రి పర్వదినాన లక్షమందికి పైగా భక్తులు వేయిస్తంభాల ఆలయానికి వస్తుంటారు. అదే తరహాలో ఈ సారి తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. ఉదయం 11 గంటల సయయానికే హన్మకొండ చౌరస్తాకు క్యూ లైన్ తట్టింది. మూడు నుంచి నాలుగు గంటల పాటు భక్తులు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. వీఐపీలను దర్శింపజేసుకోవడంలోనే ఆలయ అర్చకులు, అధికారులు బిజీబిజీగా ఉండటం గమనార్హం.
ఓ సమయమంటూ లేకుండా వీఐపీల కోసం ఎప్పుడు పడితే అప్పుడు సామాన్య భక్తజనాన్ని నిలిపివేశారని భక్తులు ఆరోపించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్తున్న సామాన్య భక్తులు చెప్పులు లేకుండా క్యూ లైన్లలో రోడ్డుపై నిలబడుతూ నరకం అనుభవించామని వాపోయారు. పిల్లాపాపాలతో ఆలయానికి వచ్చి అనేక ఇబ్బందులను చవిచూశామని తెలిపారు మహిళా భక్తులు.
వేయిస్తంభాల ఆలయంలో స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకునేందుకు దాతలకు పాసులు ఏర్పాటు చేశారు. దాతలకు ఇబ్బంది కలగకుండా గౌరవంగా స్వామి వారి దర్శనం చేయించి పంపించాలనే ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. దాన్ని ఆలయ అర్చకులు, అధికారులు, బందోబస్తుకు వచ్చిన పోలీసులు తమకు అనుకూలంగా మల్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ మిత్రబృందాలకు, కుటుంబ సభ్యులకు, బంధువులకు, ఇలా ఎవరికి పడితే వారికి వాటిని అందజేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా సామాన్య భక్తులకు మూడు నాలుగు గంటల పాటు క్యూల్లో నిల్చున్న దక్కని దర్శనం.. సదరు పైరవీదారులకు మాత్రం క్షణాల్లోనే దర్శన భాగ్యం కలుగడం గమనార్హం.
వేయిస్తంభాల ఆలయంలోని రుద్రేశ్వరుడిని దర్శించుకునేందుకు ఏటా లక్షన్నరకు పైగా భక్తులు వస్తుంటారు. ఉమ్మడి వరంగల్ తో పాటు.. హైదరాబాద్, నల్గొండ, సూర్యపేట, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల నుంచి కూడా భక్తులు ఆలయానికి వాహనాల్లో వస్తుంటారు. అయితే.. ఆలయ పరిసరాల్లో కనీసం పార్కింగ్ ఏర్పాట్లకు చర్యలు తీసుకోకపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో చేసేందేం లేక బస్టాండ్ కు వచ్చి.. వాహనాలను పార్కింగ్ చేసి తిరిగి ఆలయానికి చేరుకోవడంతో దైవ దర్శనానికి ఆలస్యం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు భక్తులు. లక్షన్నరకు పైగా భక్తులు వస్తారని తెలిసి కూడా ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లకు పూనుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది.