తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం ఇవ్వటం లేదంటూ శ్రీవారి మెట్టు వద్ద భక్తులు ధర్నాకు దిగారు. తమను దర్శనానికి అనుమతించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు. గోవింద దీక్ష భక్తులు, అనంతపురం, తమిళనాడు, కర్ణాటకలలోని వివిధ జిల్లాల నుంచి భారీగా భక్తులు కాలినడకన శ్రీవారి మెట్టుకి చేరుకున్నారు. టోకెన్లు లేకుండా దర్శనానికి అనుమతి లేదని అధికారులు చెప్పటంతో ఆందోళనకు దిగారు. దీంతో భారీగా పోలీసులు మొహరించారు.
టీటీడీ తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను నిలిపివేసింది. ఈనెల 24వరకు టోకెన్లు పూర్తవగా… డిసెంబర్ 24 నుండి జనవరి 3వరకు వైకుంఠ ద్వారా దర్శనం కోసం తిరుపతి స్థానికులకే అవకాశం ఇచ్చింది. దీంతో ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు జనవరి 4 నుండి అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో భక్తులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని టీటీడీ కోరుతుంది.
కానీ భక్తులు మాత్రం కాలినడకన వచ్చే భక్తులను దర్శనానికి అనుమతించాలని, దూరం నుండి వచ్చిన వారికి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించకపోవటం అన్యాయమని వాదిస్తున్నారు. టీటీడీ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు.