(పులిగడ్డ సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్ట్)
రాజకీయ నేతలు కరివేపాకులా తీసిపారేసే పాత్రికేయులకు ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉన్నతమైన ఆసనాలిచ్చి సముచితరీతిలో గౌరవించడం ఎంతో సంతోషం. కానీ, ఈ గౌరవం నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల.. ఈ రాష్ట్రం పట్ల విషం చిమ్మిన కరడుకట్టిన తెలంగాణ జర్నలిస్టులకు ఇవ్వడమే అత్యంత దురదృష్టకరం. పదవులన్నీ వరుసగా తెలంగాణ జర్నలిస్టులకే కట్టబెట్టడంపై సొంత రాష్ట్రంలోని యావత్తు పాత్రికేయ సమాజం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పాలకులు పట్టించుకోకపోవడం ఆక్షేపణీయం. నిన్నటివరకు ఆంధ్రులపై విద్వేషపూరిత రాతలు రాసి, వ్యాఖ్యలు చేసిన దేవులపల్లి అమర్‌ను ఏపీ ప్రభుత్వానికి జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా నియమించడమే అన్నింటికన్నా దుర్మార్గం. ఈ నియామకం ఎంతమంది హృదయాల్ని గాయపరుస్తుందో ఈ ప్రభుత్వానికి తెలియదని భావించాలా ? ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మనోభావాలు దెబ్బతింటాయన్న ఇంగితం కూడా లేదనుకోవాలా? అసలు ఈ ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి?
ఇప్పటికే సాక్షిలో పనిచేసిన ఉద్యోగులకు ప్రభుత్వం ఒక ఉపాధి కల్పన కేంద్రంగా మారిపోయినా ఎవరూ ప్రశ్నించలేదు. అంతంతమాత్రంగా బతికే జర్నలిస్టులు కొందరైనా ఉన్నత వేతనాలు పొందే కొలువుల్లో చేరారని తోటి పాత్రికేయులు సరిపెట్టుకున్నారు. ఇప్పడు వరుసగా తెలంగాణాకు చెందినవారికి మాత్రమే పదవులన్నీ సంతర్పణ చేస్తుండటం మరీ దారుణం. ఇది ఏపీ మీడియాలో తీవ్రమైన అసంతృప్తిని రగిలిస్తోంది. అమర్ నియామకానికి హర్షించిన జర్నలిస్టు ఒక్కరైనా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారా? ఢిల్లీలో మీకు ఒక సీనియర్ పాత్రికేయుడి అవసరం వుందని మీరు భావిస్తే ఈ రాష్రంలో వున్న సీనియర్ జర్నలిస్టులలో మీకు నచ్చిన వారిని నియమించుకునే స్వేచ్ఛ మీకుంది. వారిని వదిలేసి పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తికి, అది కూడా మాపై విషం చిమ్మిన వ్యక్తికి పదవి ఎలా ఇస్తారు? అమర్ గురించి మీకు తెలియదా? తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసినట్టు మీ దృష్టికి రాలేదా? ఇటువంటి వ్యక్తిని ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఎలా నియమించుకుంటారు? ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమర్ ఎటువంటి పాత్ర పోషించారో గుర్తుచేసుకోండి. ప్రత్యేక తెలంగాణ వాణిని వినిపిస్తూ మనపై ద్వేషం పెంచుతూ పలు పత్రికల్లో వందల కొద్దీ వ్యాసాలను రాశారు. ఆంధ్ర రాష్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ఒక జర్నలిస్టును ఏకంగా ఏపీ ప్రభుత్వానికి సలహాదారుగా నియమించడం ఇక్కడ పనిచేసే జర్నలిస్టులందరికీ అవమానమే. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అమర్‌ని తెలంగాణ ప్రభుత్వమే ఎలాంటి పదవిలోనూ నియమించలేదు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయలని కుట్రలు పన్ని, జర్నలిస్ట్ యూనియన్ నాయకుడి ముసుగులో కోట్లు పోగేసుకున్న వ్యక్తికి కేబినెట్ హోదాతో సలహాదారు పదవి ఇవ్వడం ఎంతమాత్రమూ సరికాదు. అంతకు ముందు ఇలానే తెలంగాణ ప్రాంతానికే చెందిన మరో జర్నలిస్టును కేబినెట్ హోదా ఇచ్చి ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. అప్పుడు కూడా మేము మాట్లాడలేదు. ఇప్పుడు కొత్తగా ఉద్యోగ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్న మరో సీనియర్ జర్నలిస్టుకు రేపోమాపో అత్యుత్తమ పదవి కట్టబెడుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఈయన కూడా తెలంగాణ ప్రాంతానికే చెందినవారే. తెలంగాణ వ్యక్తులకు పదవుల సంతర్పణ చేయడం సరికాదు. రేపు కేంద్రంలో తమకు గల అత్యున్నత అధికారాన్ని వినియోగించుకుంటూ వీరు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తారు మినహా ఏపీకి ఏవిధమైన మేలూ చేయరు. కాబట్టి కామ్రెడ్స్.. అమర్ నియామకం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే చర్యగా భావించి పాత్రికేయ సమాజమంతా ప్రభుత్వానికి నిరసన తెలియపర్చాలి. ఇది మన బాధ్యతగా గుర్తించండి. ఇక్కడున్న అన్ని పదవులకు ఈ రాష్టానికి చెందినవారినే నియమించాలి. ఇదే మన నినాదం.. మన విధానం. జర్నలిస్టులు, సమైక్యవాదులు దీన్ని వ్యతిరేకించండి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడండి.