జమ్ము కశ్మీర్ జైళ్ల శాఖ డీజీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జైళ్ల శాఖ డీజీ హేమంత్ లోహియా మృతదేహాం ఉయదవాలాలోని ఆయన నివాసంలో అనుమానాస్పదంగా పడి వుంది. సమాచారం అందుకున్న పోలీసులు డీజీ ఇంటికి చేరుకున్నారు. ఆయన గొంతు కోసి వుండటం, శరీరంపై కాలిన గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
మరో వైపు డీజీ ఇంట్లో పని మనిషి కూడా పరారీలో ఉండటం అనుమానాలకు తావిస్తోంది. వీటన్నింటిని బట్టి ఆయనను ఎవరో హత్య చేసి వుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనలో పని మనిషి జసిర్ పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై అడిషనల్ డీజీపీ ముఖేష్ సింగ్ మాట్లాడారు.
జైళ్ల శాఖ డీజీ మృత దేహం అనుమానాస్పద స్థితిలో పడి వుండటాన్ని గుర్తించామని అడిషనల్ డీజీపీ అన్నారు. నేరం జరిగిన ప్రదేశాన్ని పోలీసు బృందాలు, క్లూస్ టీమ్స్ పరిశీలించాయన్నారు. ప్రాథమికంగా దీన్ని హత్యకేసుగా అంచనా వేస్తున్నట్టు తెలిపారు. పనిమనిషి పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టినట్టు తెలిపారు.
హత్య అనంతరం లోహియా మృత దేహాన్ని తగులపెట్టేందుకు దుండగులు ప్రయత్నించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆయన మృత దేహాన్ని జమ్ములోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆయన మృత దేహానికి పోస్టు మార్టమ్ నిర్వహిస్తున్నారు. అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.