శంషాబాద్‌లో స్పైస్ జెట్ విమానంలో పొగలు రావడంతో బుధవారం విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనపై తాజాగా పౌర విమానయాన ప్రాధికార సంస్థ(డీజీసీఏ) సీరియస్ అయింది. దీనిపై దర్యాప్తునకు డీజీసీఏ ఆదేశించింది.
స్పైస్ జెట్ విమానానికి ప్రమాదం తప్పింది. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానంలో పొగలు వ్యాపించాయి. మరికొద్ది క్షణాల్లో శంషాబాద్ లో ల్యాండ్ అవుతుందనగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రయాణీకులంతా ఒక్క సారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఇంజిన్ నుంచి పొగలు వస్తుండటం గమనించిన పైలట్ విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో చాకచక్యంగా సేఫ్ గా ల్యాండ్ చేశారు. ఘటన సమయంలో విమానంలో సుమారు 100 మంది వరకు ఉన్నారు. విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
విమానంలో పొగలు ఎందుకు వచ్చాయనే విషయంపై స్పైస్ జెట్ సంస్థ స్పందించలేదు. విమానం సేఫ్ గా ల్యాండ్ అయిందని, ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నట్టు పేర్కొంది. ప్రయాణీకుల్లో ఒకరు స్వల్ప అనారోగ్యానికి గురైనట్టు ఎయిర్ పోర్టు వర్గాలు వెల్లడించాయి.
రాత్రి 11.05 గంటలకు విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావడానికి కొద్ది నిమిషాల ముందు ఇంజన్‌లో పొగలు కమ్ముకున్నాయి. ఇదిలా ఉంటే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రయాణీకులు తెలిపారు.
పొగలు వస్తున్నట్టు నాగ్ పూర్‌లోనే గుర్తించారని, కానీ విమానాన్ని అలాగే హైదరాబాద్ వరకు తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు. పొగతోనే సుమారు 20 నిమిషాలపాటు ప్రయాణం చేశామని, తామంతా ఉక్కిరి బిక్కిరి అయ్యామని విమానంలోని ప్రయాణికులు చెబుతున్నారు.