– దొంగతనం కేసులో అరెస్ట్
– నాలుగు రోజులు నరకం!
– చివరికి.. చోరీ చేయలేదని తెలిసి డ్రామా
– ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితుడి మృతి
– ఘటనపై స్పందించిన డీజీపీ
మెదక్ ఘటనపై రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ స్పందించారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి విచారణ జరపాలని ఐజీ చంద్రశేఖర్ ను ఆదేశించారు. కామారెడ్డికి చెందిన సీనియర్ పోలీస్ అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించాలని.. ఐజీ చంద్రశేఖర్ విచారణను పర్యవేక్షించాలని డీజీపీ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈఘటనలో బాధ్యులుగా భావిస్తున్న మెదక్ పీఎస్ సీఐ, ఎస్సైలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు డీజీపీ.
ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం.. మెదక్ కు చెందిన ఖదీర్ ఖాన్ అనే వ్యక్తి చిరు వ్యాపారం చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇతనికి భార్యా, ముగ్గురు పిల్లలున్నారు. సాఫీగా సాగిపోతున్న ఇతని జీవితంలోకి ఖాకీలు యమదూతల్లా ఎంటర్ అయ్యారు. గత నెల 27న అరబ్ గల్లీలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా.. ఓ మహిళ పుస్తెలతాడు కొట్టేశారని మెదక్ పీఎస్ లో ఫిర్యాదు నమోదైంది. దీంతో సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు.. అనుమానం కింద విచారించడానికి ఖదీర్ ను స్టేషన్ కు తీసుకెళ్లారు. అతని చేత నిజం కక్కించడానికి నాలుగు రోజులు ఉంచి థర్డ్ డిగ్రీని ప్రయోగించారు.
ఎలాంటి కేసు నమోదు చేయకుండానే అతన్ని కుళ్లపొడిచారు. చివరికి అతను కాదని తేలిన తరువాత అతడి భార్యను స్టేషన్ కు పిలిచి.. ఇంటికి తీసుకొని వెళ్లాలని చెప్పారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని.. బలానికి గోలీలు కూడా తామే తెచ్చి ఇస్తామని అవి వేసుకుంటే అంతా సర్దుకుంటుందని చెప్పారు. అయితే, ఖాకీల కర్కశత్వానికి తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఖదీర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణిస్తూవచ్చింది. ఈనెల 8న అతడ్ని మెదక్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ లో చేర్చారు. అక్కడ కూడా ప్రయోజనం లేకపోవడంతో గాంధీ ఆసుపత్రికి మార్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఖదీర్ గురువారం అర్థరాత్రి తర్వాత ప్రాణాలు వదిలాడు.
అయితే.. మెదక్ డీఎస్పీ మాత్రం.. తాము విచారించి వదిలిపెట్టినప్పుడు ఖదీర్ ఆరోగ్యంగానే ఉన్నాడని.. తరువాత అస్వస్థతకు గురయ్యాడని చెబుతున్నారు. కొసమెరుపు ఏంటంటే.. ఖదీర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు పరామర్శించడానికి వచ్చిన పలువురు నేతలకు.. పోలీసులు ఎలా కొట్టారో వివరిస్తూ ఆయన మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.