తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడడంతో ప్రజల్లో కలవరం ఎక్కువైంది. గత అనుభవాల దృష్ట్యా తెగ ఆందోళన పడుతున్నారు జనాలు. ఈ నేపథ్యంలో డీహెచ్ శ్రీనివాసరావు స్పందించారు. ప్రజలు ఆందోళన పడొద్దని సూచించారు. ప్రస్తుతానికి తెలంగాణలో ఇద్దరు ఒమిక్రాన్ బాధితులు మాత్రమే ఉన్నారని తెలిపారు.
కొత్త వేరియంట్ లక్షణాలు స్వల్పమే అయినా వేగంగా విస్తరిస్తోందన్న డీహెచ్.. ప్రజలంతా మాస్కులు ధరించాలని సూచించారు. శుభకార్యాల్లో తప్పనిసరిగా కోవిడ్ జాగ్రత్తలను పాటించాలని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ పై వదంతుల వ్యాప్తి జరుగుతోందన్నారు శ్రీనివాసరావు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టామని అసత్య ప్రచారం ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.