తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని ప్రకటించారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. కరోనా మూడు వేవ్ ల రూపంలో ప్రపంచాన్ని పట్టి పీడించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు.
ఫస్ట్ వేవ్ 10 నెలలు, సెకండ్ వేవ్ 6 నెలలు, థర్డ్ వేవ్ మూడు నెలలు మాత్రమే ఉందని వివరించారు డీహెచ్. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని.. వారం రోజుల్లో వందలోపే కేసులు నమోదు అవుతాయని అంచనా వేశారు. రాష్ట్రంలో జనవరి 28న థర్డ్ వేవ్ ఉద్ధృతి ముగిసిందని స్పష్టం చేశారు.
తెలంగాణలో పాజిటివీటి రేటు రెండు శాతం మాత్రమే ఉందన్నారు శ్రీనివాసరావు. అత్యధిక పాజిటివిటీ రేటు 5 శాతానికి వెళ్లిందని వివరించారు. ఫీవర్ సర్వే ద్వారా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కిట్లు అందజేశారని తెలిపారు.
కేసులు తగ్గినా మాస్కులు మాత్రం ధరించాలని ఆదేశించారు డీహెచ్. అందరూ కొవిడ్ టీకా తీసుకోవాలని సూచించారు.