సమ్మర్ వెకేషన్ .. ఈ పేరు చెప్పగానే మొదట గుర్తుకు వచ్చే పేరు కశ్మీర్. ఆ తర్వాత ఊటీ, కొడైకెనాల్ లాంటి పలు పర్యాటక కేంద్రాలు మదిలో మెదులుతాయి. కానీ అంతకు మించిన అందాలు ధనచూలీలో ఉన్నాయని చాలా మందికి తెలియదు.
అసలు అక్కడి అందాలను వర్ణించడానికి మాటలు సరిపోవు. వాటిని కండ్లతో చూసి ఆనందించాల్సిందే. చెబుతుంటేనే ధనచూలికి వెళ్లాలని అనిపిస్తోందా. మరి ఇంకెందుకు ఆలస్యం ధనచూలికి వెళదాం పదండి….
ధనచూలి.. ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ జిల్లాలోని ఓ పురాతన గ్రామం. ఇక్కడ చుట్టూ కుమాయున్ పర్వతాలు, పక్కనే పచ్చదనాన్ని పరుచుకున్న కొండలు, ఆ కొండల నడుమ అగాధ ధరి, అంతకు మించి అందమైన తోటలు, వీటికి తోడు అటుగా వచ్చి మేనును తాకి వెళ్లే మళయమారుతాలు, వాటితో ఊగే కొమ్మలు, వాటిని నుంచి రాలిపడే నిహార బిందువులు ఇలా ధనచూలి గురించి చెబుతూ పోతుంటే పెద్ద గ్రంధమే అవుతుంది.
ధనచూలిలో మరో నాలుగు ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు ఉన్నాయి. అక్కడకు వెళ్లిన వారు ఆ సుందర దృశ్యాలను చూసి పులికించిపోతుంటారు. ముఖ్యంగా బాలుగాడ్ జలపాతం ఇక్కడ ప్రత్యేకమైన ఆకర్షణ. ఇక చౌలీకి జాలీ, విక్టోరియా డ్యామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
చౌలీకి జలీ
చౌలీ అంటే పెద్ద బండరాయి, జలీ అంటే రంధ్రం. ఇది ఒక లోయ ప్రాంతం. కొండ పైనుంచి చూస్తుంటే చుట్టూ ప్రకృతి మనోహరమైన దృశ్యాలు కనిపిస్తాయి. దీనికి సంబంధించి పలు పురాణగాథలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దేవుళ్లు, దయ్యాలు ఈ ప్రదేశాన్ని తమ యుద్ధభూమిగా మలుచుకుని ఇక్కడ యుద్ధం చేశాయని కథలు ప్రచారంలో ఉన్నాయి.
బాలుగాడ్ జలపాతాలు
ధనచూలికి నాలుగు కిలోమీటర్ల దూరంలో బాలుగోడ్ జలపాతం ఉంటుంది. ఈ జలపాతంలో నీళ్లు చాలా తేటగా ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ జలపాతం గలగల శబ్దాలను వింటూ,అంతుకు మించిన అగాధదరిని చూస్తూ ఊహాలోకంలోకి వెళ్లిపోవచ్చు.
ముక్తేశ్వర్ ధామ్
ముక్తేశ్వర ధామ్ అనే చాలా ప్రసిద్ది చెందిన పురాతనమైన ఆలయం. ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడు. ఎత్తైన కొండల మీద ఈ ఆలయం ఉండటంతో ఇటు ట్రెక్కింగ్ అనుభూతి కలగడంతో పాటు అటు ఆ దేవదేవుని దర్శనం కూడా లభిస్తుంది.
విక్టోరియా డ్యామ్
విక్టోరియా డ్యామ్ అనేది ఒక థ్రిల్లింగ్ టూరిస్ట్ డెస్టినేషన్. ధనచూలికి 12 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. డ్యామ్ చుట్టూ అందమైన కొండలు ఉన్నాయి. వాటిపైనే ఆపిల్ తోటలు కనిపిస్తాయి.
డ్యామ్ పక్కనే ప్రసిద్ధి చెందిన భీమేశ్వర్ ఆలయం ఉంటుంది. డ్యామ్ గుండా ప్రవహించే బీమ్ టాల్ సరస్సు.. ఇలా విక్టోరియా డ్యామ్ గురంచి ఎంత చెప్పినా తక్కువే. అందుకే ధనచూలికి వెళ్లిన వారు మళ్లీ మళ్లీ అక్కడికి వెళ్లకుండా ఉండలేదు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెళ్లి ఓ లుక్ వేసి రండి.