ధోని పని అయిపోయింది అన్నారు. ఇక ధోని క్రికెట్‌కు పనికి రాడని, ఆడటం అవసరమా అంటూ ట్రోల్ చేశారు. తన పని ఇంకా అవ్వలేదని, తనపై వచ్చిన విమర్శలపై మహేంద్ర సింగ్ ధోని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తన అభిమానులకు ధోని అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ఐపీఎల్‌లో తొలిసారి సీఎస్‌కే తరుపున నాన్ కెప్టెన్‌గా బరిలో దిగిన ఎంఎస్ ధోనీ, సాధారణ ప్లేయర్‌గా ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే ధనాధన్ బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ సాధించారు. కానీ.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని మాత్రం గెలిపించలేకపోయారు. అయితే.. ఓ పాత రికార్డ్‌ని మాత్రం ఈ క్రమంలో బ్రేక్ చేశారు.
మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ 2022 సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో ఫామ్ అందుకున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో వాంఖడే వేదికగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కేవలం 38 బంతుల్లోనే 7×4, 1×6 సాయంతో 50 పరుగులు చేసిన ధోనీ.. చివరి వరకూ అజేయంగా క్రీజులో నిలిచారు. దీంతో.. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై టీం 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే 133/4తో కోల్‌కతా ఛేదించేసింది.
ధోని మూడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో మళ్లీ 50 పరుగుల మార్క్‌ని అందుకున్నారు. గత రెండు సీజన్లలో పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డ ధోని అదిరిపోయే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నారు. 38 బంతుల్లో 50 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో మైమరిపించారు.ఈ హాఫ్ సెంచరీతో ధోని ఖాతాలో అదిరిపోయే రికార్డు చేరింది. 2019 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆఖరిగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన ధోనీ.. శనివారం వరకూ మళ్లీ 50 పరుగుల మైలురాయిని చేరుకోలేకపోయారు. ఆ మ్యాచ్‌లో 48 బంతుల్లోనే ధోనీ 84 పరుగులు చేసినా.. బెంగళూరు చేతిలో చెన్నై పరుగు తేడాతో ఓడిపోయింది.
2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఈ టోర్నీ చరిత్రలో లేటు వయసులో హాఫ్ సెంచరీ నమోదు చేసిన భారత ఆటగాడిగా మహేంద్రసింగ్ ధోనీ నిలిచారు. ధోనీ 40 ఏళ్ల 226 రోజుల వయసులో హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. ఇప్పటి వరకూ ఈ రికార్డ్ రాహుల్ ద్రవిడ్ పేరిట ఉంది. 2013లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ద్రవిడ్ 40 ఏళ్ల 116 రోజుల వయసులో అర్ధశతకం బాదారు. అతని తర్వాత సచిన్ టెండూల్కర్ 39 ఏళ్ల 362 రోజుల వయసులో హాఫ్ సెంచరీ సాధించారు. అయితే, ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.