వాతావరణం అనుకూలించకపోతే విమానాలు దారి మళ్లడం తరచూ జరుగుతుండేవే. అయితే.. కొన్నిసార్లు ప్రయాణికులకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. గంటల కొద్దీ విమానంలో ఉండిపోవడం.. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. తాజాగా బాలీవుడ్ నటి దియా మీర్జాకు ఇవన్నీ ఎదురయ్యాయి.
శుక్రవారం రాత్రి ముంబై నుంచి ఢిల్లీకి వెళ్తున్న విస్తారా ఎయిర్ లైన్స్ విమానం యూకే 940ని దారి మళ్లించి జైపూర్ లో ల్యాండ్ చేశారు. ఈ క్రమంలో తనకు ఎదురైన అనుభవాలను శనివారం ఉదయం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది దియా మీర్జా.
“ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం దారి మళ్లించి జైపూర్ లో ల్యాండ్ చేశారు. విమానం లోపలే 3 గంటలపాటు ఎదురుచూశాం. తర్వాత క్యాన్సిల్ అయింది. కిందకు దిగిపోండని సిబ్బంది చెప్పారు. దీనిపై ఎయిర్ పోర్ట్ అథారిటీ కానీ.. విస్తారా కానీ ఎటువంటి సాయం చేయలేదు. అడిగిన దానికి సరైన సమాధానం చెప్పలేదు. మా బ్యాగులు ఎక్కడ?” అని ట్వీట్ చేసింది దియా మీర్జా.
వాతావరణం అనకూలించకపోవడం వల్లే జైపూర్ లో విమానాన్ని దించామని విస్తారా వివరణ ఇచ్చింది. కానీ.. ప్రయాణికులు మాత్రం తమకు ఎదురైన అనుభవాలను వివరిస్తూ తిట్టి పోస్తున్నారు. తాము ఢిల్లీ చేరుకునేందుకు సొంత ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చిందని మండిపడుతున్నారు.