గుంటూరు టీడీపీ సభలో తొక్కిసలాట ఘటనపై అధికార, ప్రతి పక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇరు పార్టీలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ ఘటనపై నిన్న మాట్లాడిన మంత్రి జోగి రమేశ్ టీడీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు పేదల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు.
ఇక దీనికి టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ ముగ్గురు మహిళలు మరణించారా? లేదా చంపేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. సీఎం జగన్, వైసీపీ నేతలు కలిసే వారిని చంపేశారని ఆయన ఆరోపణలు గుప్పించారు.
చంద్రబాబు సభలకు జనాలు పోటెత్తుతున్నారని చెప్పారు. దీన్ని చూసి వైసీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. ఈ పనులను వైసీసీ స్లీపర్ సెల్స్ చేస్తున్నాయంటూ ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పోలీసులు ముందే సభాస్తలిని వచ్చి పరిశీలించాక కూడా ఈ దుర్ఘటన ఎలా జరిగిందని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు గుంటూరు ఘటనపై ఎంపీ రఘురామ కృష్ణమరాజు స్పందించారు. చంద్రబాబు ప్రసంగం ముగించుకుని వెళ్లిపోయారని, ఆ తర్వాత భారీకేడ్లు విరిగిపోయాయన్నారు. సభలో కావాలనే కొందరు ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. కొందరు మంత్రుల చేస్తున్న పోస్టులు, స్టేట్ మెంట్స్ చూస్తుంటే అది నిజమేనన్న అనుమానం వస్తోందన్నారు.
చంద్రబాబు సభలో జరిగింది కాబట్టి దానికి ఆయనే కారణమంటున్నారని ఆయన తెలిపారు. మరి అన్నమయ్య గేట్లు తెగి 50 మంది మరణించారని పేర్కొన్నారు. అలా అయితే అవన్నీ సీఎం జగన్ చేసిన హత్యలేనా?అంటూ ఆయన ప్రశ్నించారు. దీని వెనుక కుట్ర ఉందన్నారు. దీని వెనుక ప్రభుత్వమా? లేదా ప్రభుత్వ పెద్దలు ఉన్నారా? అన్న అనుమానం కలుగుతోందన్నారు.