– బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం
– ఉప ఎన్నిక దగ్గర పడే కొద్దీ రెచ్చిపోతున్న నేతలు
– ఒకరిపై ఒకరు విమర్శల దాడి
మునుగోడులో గెలుపు టీఆర్ఎస్, బీజేపీకి చాలా అవసరం. సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఈ ఎన్నిక అసలు ఎలక్షన్ లో విజయాన్ని డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. అందుకే రెండు పార్టీలు పోటీపడి మరీ తిట్ల దండకాన్ని అందుకున్నాయి. నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి ఈ వార్ మరింత పీక్స్ కు చేరింది. నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. 8 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఒరిగిందేంటని బీజేపీ నేతలు అంటుంటే.. రాజగోపాల్ వేస్ట్ అంటూ గులాబీ నేతలు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.20వేల కోట్ల కాంట్రాక్టు పొందానని బహిరంగంగా చెప్పిన ఆయన పెద్ద దొంగ అని విమర్శించారు. ఈ విషయంపై ఈసీకి కూడా కంప్లైంట్ చేస్తామన్నారు. దిగజారుడు రాజకీయాలు చేసి.. త్యాగం చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని.. అన్ని రేట్లు పెరుగుతాయని చెప్పారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే పెండింగ్ పనులు అన్నీ పూర్తి చేస్తామని.. అభివృద్ధి పనులు కొనసాగుతాయని వివరించారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడే ప్రతి అక్షరం అబద్ధమేనని అంటున్నారు జగదీష్ రెడ్డి. తెలంగాణ ప్రగతిని చూసి ఓర్వలేక బీజేపీ దుర్బుద్ధితో ఉపఎన్నికను తీసుకొచ్చిందని మండిపడ్డారు. ప్రజలు బాగా ఆలోచించి అభివృద్ధి చేసే పార్టీకే పట్టం కట్టాలని కోరారు. అసలు రాజగోపాల్ కు పోటీ చేసే హక్కే లేదని.. ప్రజలే నిలదీసే పరిస్థితి వచ్చిందన్నారు జగదీష్ రెడ్డి.
మరోవైపు రాజగోపాల్ రెడ్డి సైతం ఏమాత్రం తగ్గడం లేదు. రాజీనామా చేసిన సమయం నుంచి కేసీఆర్ ను టార్గెట్ చేసిన ఆయన.. ఉప ఎన్నిక దగ్గర పడుతుండడంతో విమర్శల దాడిలో స్పీడ్ పెంచారు. ఓవైపు బీజేపీలోకి చేరికలను ప్రోత్సహిస్తూ.. ఇంకోవైపు అధికార పార్టీని తిట్టిపోస్తున్నారు. ఈ పోటీ మునుగోడు ప్రజలకు, కేసీఆర్ కు మధ్య జరుగుతోందని చెబుతున్నారు. మునుగోడులో జరుగుతున్న ధర్మయుద్ధంలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కేసీఆర్ కుటుంబం బాగుపడిందని ఉప ఎన్నికలో బీజేపీ గెలిచిన నెల రోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చేసి కేసీఆర్ ఎన్నికలకు వెళ్తారని జనానికి చెబుతున్నారు రాజగోపాల్.