డైమండ్ రింగ్.. ఇందులో ఒక డైమండ్ ఉంటేనే ఆ రింగ్ ధగధగ మెరుస్తుంది. మరి అదే రింగ్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 వేల వజ్రాలుంటే.. వామ్మో.. ఊహించుకుంటేనే ధగధగలు కళ్ళను కప్పేస్తున్నాయి. యూపీకి చెందిన ఓ ఆభరణాల తయారీ సంస్థ పువ్వు ఆకారంలో 26 వేల వజ్రాలను ఉపయోగించి ఉంగరాన్ని తయారు చేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.
సాధారణంగా వజ్రం అంటేనే చాలా ఖరీదైంది. అలాంటిది ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ కు చెందిన డాజ్లింగ్ జ్యువెలరీ అనే ఆభరణాల తయారీ సంస్థ 26,200 వజ్రాలతో పొదిగిన ఉంగరాన్ని తయారు చేసింది. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యధిక వజ్రాలతో పొదిగిన ఉంగరంగా రికార్డును సొంతం చేసుకుంది. పువ్వు ఆకారంలో ధగధగ మెరుస్తున్న ఈ ఉంగరానికి దేవ్ ముద్రిక అని నామకరణం చేసినట్టు సంస్థ యజమాని విపుల్ అగర్వాల్ తెలిపారు.
అయితే ఇది వరకు ఓ సంస్థ 24 వేల వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని తయారు చేసింది. 26,200 వజ్రాలతో దేవ్ ముద్రిక తయారీతో ఈ రికార్డును బద్దలు కొట్టినట్లైంది. మొదట సాఫ్ట్ వేర్ ద్వారా దేవ్ ముద్రిక డిజైన్ ను సంస్థ రూపొందించింది. తర్వాత కళాకారులతో తయారు చేయించామని సంస్థ యజమాని విపుల్ అగర్వాల్ వెల్లడించారు.
పది మంది కళాకారులు మూడు నెలల పాటు కష్టపడి ఉంగరానికి తుది రూపు ఇచ్చినట్టు ఆయన తెలిపారు. రెండు వేళ్లకు పెట్టుకునే ఈ ఉంగరానికి ధర ఇంకా నిర్ణయించలేదన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు కోసం దరఖాస్తు చేస్తామని తెలిపారు. అందులో స్థానం సంపాదించిన తర్వాతే ధర వెల్లడిస్తామని విపుల్ అగర్వాల్ చెప్పారు. మరి అప్పుడైనా ప్రపంచంలోనే అత్యధిక వజ్రాలతో ధగధగ మెరిసిపోతున్న ఈ దేవ్ ముద్రిక ఉంగరం ఎవరి సొంతం అవుతుందో చూడాలి.