కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు విషయంలో విదేశాంగ మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది గతంలో కాంగ్రెస్ నాయకులు మద్దతిచ్చిన చట్టం యొక్క పరిణామమని ఆయన అన్నారు. ఓ ఆంగ్ల ఛానెల్ నిర్వహించిన రైజింగ్ ఇండియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ అనర్హత విషయంలో ఇతర దేశాల వ్యవహారాల మంత్రులు మీ దగ్గర ఈ సమస్యను లేవెనెత్తారా? అని మీడియా ఆయన అడిగింది. దానికి ఆయన బదులిస్తూ… తన వద్ద ఎవరూ అలాంటి ప్రస్తావన తీసుకు రాలేదని కేంద్ర మంత్రి వెల్లడించారు.
నాలుగేండ్ల క్రితం ఓ బహిరంగ సభలో ఒక సామాజికవర్గంపై రాహుల్ గాంధీ అవమానకర వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ వ్యాఖ్యలపై పశ్చాతాపం వ్యక్తం చేసేందుకు నిరాకరించడంతోనే ఆయనపై అనర్హత వేటుకు దారి తీసిందని ఆయన వివరించారు.
ఇతర దేశాల మంత్రులకు ఈ విషయాన్ని ఎలా వివరిస్తారంటూ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ… నాలుగేండ్ల క్రితం ఓ బహిరంగ సభలో ఒక వర్గాన్ని రాహుల్ గాంధీ కించపరిచారన్నారు. ఇది పబ్లిక్ రికార్డ్‌లో ఉందన్నారు. ఆ వర్గానికి చెందిన ఒక సభ్యుడు ఆగ్రహించి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడన్నారు.
ఆ క్రమంలో ఆయనపై అనర్హత వేటు పడిందన్నారు. గతంలో ఆ చట్టానికి కాంగ్రెస్ నేతలే మద్దతిచ్చారన్నారు. ఈ చట్టం కింద 10 నుంచి 12 మంది ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడిందన్నారు. అందులో అధికార పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారని ఆయన గుర్తు చేశారు.