– పీఎంను కలిసి ముందస్తు కావాలన్న జగన్?
– సందేశం అందింది..
– ముందస్తుకే ఎలక్షన్ కమిషన్ హామీ?
– తెలంగాణలో మాత్రం నిర్ణీత సమయంలోనే..!
– బీజేపీకి పార్లమెంట్ సీట్లు భారీగా తగ్గుతాయని అంచనాలు
– అందుకే.. జాగ్రత్త పడుతోన్న కమలం పార్టీ?
– పొత్తుల విషయంలో ఆచితూచి అడుగులు
– ఏ పార్టీతోనూ పొత్తు వద్దని నిర్ణయం?
– ఫలితాల తర్వాత వచ్చే సీట్లను బట్టే డెసిషన్!
ఆంధ్రాలో ముందస్తు ఎన్నికలు ఉంటాయని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలు చూస్తుంటే.. అది నిజమేనని అర్థం అవుతోంది. సీఎం జగన్ ముందస్తు కోరిక మేరకు ప్రధాని మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఈక్రమంలోనే జగన్ ప్రభుత్వ ప్రతినిధులు.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో చర్చలు జరిపినట్టుగా టాక్ నడుస్తోంది. సానుకూల సందేశమే అందిందని.. ఏపీలో ఎన్నికలు ముందుగానే జరుపుతామని వారితో చెప్పినట్టుగా విశ్వసనీయ సమాచారం.
ఇటు బీజేపీ వ్యూహాలు కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఏపీలో ప్రధానమైన రెండు పార్టీల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వొద్దని బీజేపీ నిర్ణయించింది. ఆ రెండు పార్టీలు తమకు అనుకూలంగా ఉన్న కారణంగా పార్లమెంట్ లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే.. ఆ పార్టీకి అనుకూలంగా ఉండాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే బీజేపీ ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు సమాచారం.
గత ఎన్నికలతో పోల్చుకుంటే.. ఈసారి 80 పార్లమెంట్ స్థానాలు తగ్గుతాయన్న సర్వే అంచనాలతో బీజేపీ ఆచితూచి అతి జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. టీడీపీ, జనసేన.. బీజేపీతో కలిసి పోటీ చేయడానికి సిద్ధపడినప్పటికీ పార్లమెంట్ సీట్లను దృష్టిలో పెట్టుకుని ఒంటరిగానే వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. అయితే.. తెలంగాణ పర్యటనలో పవన్ కళ్యాణ్ మాత్రం తాము బీజేపీతోనే ఉన్నామని ప్రకటించారు. కానీ, భీమవరంలో జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ ఓ రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది. అందులో ఎక్కడా.. తాము మిత్రపక్షాలతో కలిసి ఉన్నామని కానీ.. జనసేనతో కలిసి పోటీ చేస్తామని కానీ చెప్పలేదు.
వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా తాము ఎదుగుతామని తీర్మానం చేసుకుంది బీజేపీ. కనీసం జనసేనను గుర్తించడానికి కూడా ఆసక్తి చూపించలేదు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి.. ఏపీ అభివృద్ధి చెందాలి అంటూ తీర్మానం ఆమోదింపజేసుకుంది. టీడీపీ, వైసీపీలతో పొత్తులు పెట్టుకునే అవకాశాల్లేవని స్పష్టమవుతోంది. వచ్చే సీట్లను బట్టి ఏ పార్టీకి దగ్గరగా ఉండాలనేది అప్పుడు డిసైడ్ అవ్వాలని భావిస్తోంది బీజేపీ. టీడీపీతో జట్టు కట్టేందుకు సైతం పవన్ ఆసక్తిగానే ఉన్నారు. బీజేపీ ముందు మూడు ఆప్షన్స్ పెట్టారు. ఒంటరిగా, బీజేపీతో, లేదంటే వేరే పొత్తుతో వెళ్తామని కచ్చితంగా చెప్పారు. ఇప్పుడు ముందస్తు ఎన్నికలు ఉంటాయని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సీట్లను దృష్టిలో పెట్టుకుని బీజేపీ జాగ్రత్త పడుతోందని ప్రచారం జరుగుతోంది.
ఎన్నికలకు ముందే ఓ పార్టీతో సత్సంబంధాలు కొనసాగిస్తే.. అవతలి పార్టీ గెలిస్తే పరిస్థితి ఏంటి..? అప్పుడు పార్లమెంట్ సీట్లు తగ్గితే ఆపార్టీ మద్దతిస్తుందా? ఇలా అన్నింటినీ అంచనా వేసుకుని ఎవరితోనూ జట్టు కట్టకూడదని బీజేపీ డిసైడ్ అయిందని అంటున్నారు.