మత ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వివాదం నేపథ్యంలో రాష్ట్రీయ జనతాదళ్ నాయకులు తేజస్వీయాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మతం సారాంశాన్ని అర్థం చేసుకోలేని వారు అనవసర విషయాలకు మతపరమైన రంగులు పులుముతున్నారని అన్నారు.
ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. లౌడ్ స్పీకర్ల అంశాన్ని లేవనెత్తుతున్న వారిని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నట్టు ట్వీట్ లో ఆయన తెలిపారు. లౌడ్ స్పీకర్లను 1925లో కనుగొన్నారని తెలిపారు.
దేశంలో 1970 నుంచి ఆలయాలు, మసీదులపై లౌడ్ స్పీకర్లను వినియోగిస్తున్నారని చెప్పారు. అయితే లౌడ్ స్పీకర్లు లేక ముందు దేశంలో దేవుడా లేడా? లౌడ్ స్పీకర్ల లేక ముందు అసలు ప్రార్థనలే జరగలేదా? అని ప్రశ్నించారు.
దేశంలోని నిరుద్యోగ సమస్య గురించి ఎందుకు చర్చించడం లేదు? ద్రవ్యోల్బణం, రైతుల కష్టాలపై ఎందుకు చర్చ జరగడం లేదు? కేవలం లౌడ్ స్పీకర్లు, బుల్డోజర్లపైనే ఎందుకు చర్చిస్తున్నారు? ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. వాస్తవ అంశాలపై చర్చ నుంచి వారు తప్పుకుంటున్నారు అని పేర్కొన్నారు.