కరోనా వారియార్స్… గతేడాది ఈ పేరు మారుమ్రోగింది. వారి సేవలకు గుర్తింపుగా వీరిపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. గంటల పాటు పీపీఈ కిట్స్ ధరించి… ప్రాణాలకు తెగించి కరోనా పాజిటివ్ బాధితులకు వైద్యం అందించారు. అయితే, అదే సమయంలో కరోనా సోకి పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది కన్నుముశారు.
అయితే వారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందిస్తామని హామీ ఇచ్చాయి. కానీ ఆ హామీలు ప్రకటనలకే పరిమితం అయ్యాయి. బీహార్ రాష్ట్రంలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తూ మొత్తం 42 మంది వైద్యులు మృతి చెందారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు 50 లక్షల చొప్పున, నితీష్ సర్కారు 4 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించాయి.
కానీ దాదాపు 42మంది వైద్యులకు ఇప్పటి వరకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని తెలుస్తోంది. ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా… పట్టించుకోవటం లేదని, చాలా రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మండిపడుతుంది.