ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా ఇక లేరు. అద్భుతమైన ఆటతో, కళ్లు చెదిరే విన్యాసాలతో అభిమానులనను అలరించిన ఈ మేటి ఆటగాడు ఇక కానరారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డిగో మారడోనా గుండెపోటుతో కన్నుమూశారు.
1986 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్‌తో అభిమానుల గుండెల్లో మరిచిపోని ముద్రవేసుకున్నారు డిగో. ఆ తర్వాత 20 ఏళ్లకు పైగా తనదైన దూకుడైన ఆటతో అలరించారు. ప్రత్యర్థులను చాకచక్యంగా బోల్తా కొట్టించే నైపుణ్యం ఆయన సొంతం. అర్జెంటీనాలో ఆయన్ని గోల్డెన్ బాయ్ అని పిలుచుకుంటారు.
మంచి ఫామ్‌లో ఉండగానే కొకైన్ వాడకం ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. దానికి తోడు ఊబకాయంతో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇటీవలే డిగో మెదడుకు అరేషన్ జరిగింది. రెండు వారాల క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. త్వరలోనే కోలుకొని మాములు మనిషి అవుతాడని అనుకొంటుంటే.. ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది.
అటాకింగ్‌లో డీగో మారడోనాది ప్రత్యేక శైలి. పోట్లగిత్త లాంటి దూకుడు, మెరుపు వేగంతో.. రెండు కాళ్ల మధ్య అతి సునాయసంగా బంతిని మార్చుకుంటూ ప్రత్యర్థులు ఊహించిన విధంగా గోల్స్ చేస్తుండేవారు. కానీ ఉబకాయం కారణంగా రాను రాను అయన వేగం తగ్గింది. దీనికి తోడు 1991లో డోపింగ్‌లో పట్టుబడి కొద్ది రోజులకు ఆటకు దూరమయ్యాడు. మళ్లీ కెరీర్ రీస్టార్ట్ చేసినా రిటైరయ్యేంత డోపింగ్ వివాదం ఆయన్ను వెంటాడింది. ఆ తర్వాత అర్జెంటీనా కోచ్‌గా కూడా పనిచేశారు. ఏదేమైనా పేద కుటుంబంలో పుట్టిన డిగో…ప్రపంచం మెచ్చే ప్లేయర్‌గా ఎదగడం ఎంతో మందికి స్ఫూర్తిని కలిగించింది.