రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్, ధరలతో సామాన్య ప్రజలకే కాదు టీఎస్ ఆర్టీసీ లాంటి సంస్థలకు సైతం కష్టాలు తప్పడం లేదు. పెరుగుతున్న పెట్రో ధరలకు తగ్గట్టు ప్రభుత్వం నుండి సరైన సబ్సిడీ అందక తెలంగాణ ఆర్టీసీ ఇబ్బందులను ఎదుర్కొంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఆర్టీసీని డీజిల్ కొరత వేధిస్తోంది. గతంలో ప్రభుత్వం డీజిల్ పై రూ. 7 రూపాయలు సబ్సిడీ ఇచ్చేది. డీజిల్ పై సబ్సిడీ రావడంతో ఆర్టీసీ పెద్ద ఎత్తున డీజిల్ ను కొనుగోలు చేసింది. అయితే.. ఫిబ్రవరి 16 నుంచి ఈ సబ్సిడీని ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో టీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రైవేట్ బంకులను ఆశ్రయించారు. ప్రైవేట్ పెట్రోల్ బంకుల్లో డీజిల్ ను ఫిల్ చేయిస్తున్నారు.
తాజాగా.. ఖమ్మం డిపో నుంచి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బంకుల వద్ద క్యూలు కడుతున్నాయి. ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు ప్రైవేట్ బంకుల్లో డీజిల్ ను కొనుగోలు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు.
డిపోల నుంచి బస్సులను ప్రైవేట్ బంకుల వద్దకు తరలించడం ఇబ్బందిగా ఉందని ఆర్టీసీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాతో పాటు పలు జిల్లాల్లో ఇదేవిధమైన పరిస్థితులు నెలకొన్నాయని విశ్వసనీయ సమాచారం.