ఆర్టీసీ కేరాఫ్‌ అడ్డగోలు దోపిడి - Tolivelugu

ఆర్టీసీ కేరాఫ్‌ అడ్డగోలు దోపిడి

ఓవైపు ఆర్టీసీ సమ్మెతో మరింత భారీగా నష్టపోతున్న ఆర్టీసీకి, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం మరింత ఇబ్బందులకు గురిచేసేలా ఉంది. కార్మికుల విషయంలో ప్రభుత్వం పట్టింపులకు పోయి, తాత్కాలిక ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ఆ చర్యలే ఇప్పుడు ఆర్టీసీకి మరింత నష్టాన్ని తెచ్చిపెడుతోన్నాయి.

తాత్కాలిక డ్రైవర్లకు బస్సులు అప్పజెప్పటంతో… ఎప్పుడు ఎక్కడి నుండి దుర్వార్త వినాల్సి వస్తుందోనని డిపో మేనేజర్లు బెంబెలెత్తిపోతున్నారు. డ్రైవర్లంతా అనుభవలేమితో తరచూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. దీంతో బస్సు బయటకు వెళ్తే వచ్చే లాభమెంతో గానీ, బస్సులకు జరుగుతోన్న నష్టమే ఎక్కువుందన్న వాదన వినిపిస్తోంది.

అయితే, మహబూబ్‌నగర్ జిల్లాలో తాత్కాలిక డ్రైవర్లకు తోడు కండెక్టర్లు కూడా తోడయ్యారు. ఆర్టీసీని ముంచడానికి ఇంతకన్నా సరైన సమయం లేదన్నట్లుగా… డ్రైవర్లు, కండక్టర్లు కుమ్మక్కై టికెట్లు ఇవ్వకుండా కొంత మొత్తాన్ని, డీజీల్ అమ్ముకొని కొంత మొత్తాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తొమ్మిది ఆర్టీసీ డిపోలు ఉండగా 3,915 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో 1,415 మంది డ్రైవర్లు,1,697 మంది కండక్టర్లు. 803 మంది ఇతర సిబ్బంది. వీరంతా సమ్మె బాట పట్టడంతో ఇదే అదునుగా భావించిన తాత్కలిక సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికులే దేవుళ్లు అన్న స్లోగన్ మరిచి… దొరికినంత దోచుకో అన్నట్లు అయిపోయింది పరిస్థితి. తాత్కాలిక కండక్టర్ అడిగినంత ఇవ్వకపోతే ప్రయాణికుడితో గొడవకు దిగి వారిని మార్గమధ్యలోనే దింపివేస్తున్నారు. డిపోకు చేరుకున్న తరువాత వచ్చిన కలెక్షన్ లో సగం చేతి వాటం చూపించి.. మిగిలిన దాంట్లో రోజువారి కేటాంచిన వారి భత్యం తీసుకోగా… అదికారులకు ఇచ్చిన డబ్బులో సగం డబ్బులు మాత్రమే రిజిస్టర్ లో వ్రాస్తున వైనం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఇక డీజీల్ విషయానికి వస్తే… మహబూబ్ నగర్ రిజియన్ పరిధిలో 65 వేల లీటర్ల డిజిలు అవసరం. కార్మికులు సమ్మె మెుదలు పెట్టి నేటికి 14 రోజులు కావడంతో ఈరోజు వరకు డిజిల్ కోసం డి.డి. లు కట్టలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న డీజిల్ రెండు మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు వచ్చే అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్రంలో తాగినోడికి… తాగినంత మద్యం అన్న చందంగా పోసుకున్నోడికి పోసుకున్నంత డీజిల్ అన్నట్లు పాలమూరు ఆర్టీసీలో కొందరు తమ సొంత కార్లకు డిజిల్ నింపుకొని పోతున్నారు. ఇక బ్యాటరీలు, టైర్ల విషయంలోనూ ఇదే చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp