– మోడీ, అమిత్ షా మధ్య దూరం పెరిగిందా?
– మేజర్ రాష్ట్రాల వ్యవహారాలన్నీ మోడీనే చూస్తున్నారా?
– 11 రాష్ట్రాల్లో యాక్టివిటీ అంతా మోడీ కనుసన్నల్లోనే!
– వాటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా!
– త్వరలో తెలంగాణలో టూర్
– ఎన్నికల నాటికి బీజేపీలో షాకింగ్ పరిణామాలు?
దేశంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదగడం వెనుక.. మోడీ, అమిత్ షాల పాత్రే ఎంతో కీలకమైంది. వీరిద్దరి చాణక్యానికి ప్రత్యర్థులు విలవిలలాడిన సందర్భాలు ఎన్నో. ఎప్పటికప్పుడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. వరుసగా రెండు పర్యాయాలు ఢిల్లీ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించడం వెనుక తిరుగులేని వీరి వ్యూహాలు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. అలాగే, ఈసారి షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్ లేదా మే నెలలో సార్వత్రిక ఎన్నికలు ఉండనున్నాయి. మూడోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ విజయం అందుకోవాలన్నది బీజేపీ వర్గాల ఆశ. అయితే.. ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుంది? ఎందుకంటే మారుతున్న సమీకరణాల నేపథ్యంలో, ఈ బీజేపీ దిగ్గజాల మధ్య విభేదాలు పొడచూపుతున్న పరిస్థితుల్లో మరో విజయం కమలనాథుల ఖాతాలో చేరుతుందా! లేదా! ఇదే ఇప్పుడు కాషాయ శ్రేణులను కలవరానికి గురి చేస్తోంది.
ఇన్నాళ్లూ మోడీ, షా ద్వయం ఉమ్మడి వ్యూహాలే బీజేపీ విజయాలకు వెన్నుదన్నుగా నిలిచాయి. అయితే.. ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మోడీ, అమిత్ షా మధ్య దూరం పెరిగినట్టు తెలుస్తోంది. ఈమధ్య కాలంలో జరుగుతున్న కొన్ని పరిణామాలను అంచనా వేసి రాజకీయ పండితులు సైతం ఈ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రాలకు సంబంధించిన కీలక వ్యవహారాలన్నీ అమిత్ షా కనుసన్నల్లోనే జరిగేవి. కానీ, ఇప్పుడు సీన్ మారిపోయిందని అంటున్నారు.
ఈ ఏడాది 9 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఇది కీలక సమయం కావడంతో.. పెరిగిన గ్యాప్ కారణంగా.. అంతా అమిత్ షా కు వదిలేయకూడదని మోడీ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. అంతేకాదు.. దేశంలోని మేజర్ రాష్ట్రాల వ్యవహారం ఇప్పుడు నేరుగా ప్రధానినే చూస్తున్నారని అంటున్నారు. దాదాపు 11 రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలను చూసుకునేందుకు మోడీనే డైరెక్ట్ గా రంగంలోకి దిగారని సన్నిహితవర్గాల భోగట్టా. షా తో పెరిగిన గ్యాప్ నేపథ్యంలోనే పీఎం ఎంట్రీ ఇచ్చారని అంచనా వేస్తున్నారు.
మోడీ చూసుకుంటున్న 11 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి. ఈ ఏడాదే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉండనున్నాయి. ఏపీకి వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈక్రమంలో ముందు తెలంగాణపై మోడీ ఫోకస్ పెట్టారని అంటున్నారు. ఫిబ్రవరిలో టూర్ పెట్టుకున్న పీఎం.. వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తర్వాత పీఎం తొలిసారి రాష్ట్రానికి రానున్నారు. పరేడ్ గ్రౌండ్ లో సభ కూడా ఉండనుంది. కేసీఆర్, జాతీయ నేతలకు మోడీ కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. అయితే.. చాణక్య, చంద్రగుప్తుల మధ్య పెరిగిన దూరం బీజేపీలో ఎలాంటి షాకింగ్ పరిణామాలకు దారి తీస్తుందోననేది రాజకీయ పండితులు వేయికళ్లతో గమనిస్తున్నారు.