రాధేశ్యామ్ సినిమా కోసం టోటల్ యూనిట్ అంతా చాలా కష్టపడింది. 2 దశల కరోనాను దాటుకొని, భారీ సెట్లు వేసి మరీ షూటింగ్ చేసింది. ఫారిన్ టెక్నీషియన్లను సమన్వయం చేసుకొని షూటింగ్ పూర్తిచేసేటప్పటికి ప్రాణం పోయినంత పనైంది. అయితే ఈ కష్టమంతా ఒకెత్తు, ఒకే ఒక్క సన్నివేశం మరో ఎత్తు అంటున్నాడు ప్రభాస్. సినిమా క్లైమాక్స్ లో వస్తే షిప్ ఎపిసోడ్ కోసం పడిన కష్టాన్ని బయటపెట్టాడు.
“రాధేశ్యామ్ క్లైమాక్స్ లో షిప్ ఎపిసోడ్ ఉంది. దాని కోసం డైరక్టర్ రాధ రెండేళ్లు కష్టపడ్డాడు. స్కెచ్ నుంచి స్టార్ట్ చేసి ఆర్ట్ వరకు ఎప్పటికప్పుడు మార్పుచేర్పులు చేసుకున్నాడు. మరోవైపు విదేశీ టెక్నీషియన్స్ ను లైన్లోకి తీసుకొచ్చి షిప్ ఎపిసోడ్ కోసం అతడు పడిన కష్టాన్ని నేను కళ్లారా చూశాను. కేవలం ఆ 10 నిమిషాల సన్నివేశం కోసమే రెండేళ్లు టైమ్ కేటాయించాడు రాధ. సినిమాలో అది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.”
రాధేశ్యామ్ క్లైమాక్స్ మొత్తం ఆ షిప్ లోనే నడుస్తుంది. దాని కోసం రామోజీ ఫిలింసిటీలో ఓ భారీ ఫ్లోర్ లో షిప్ సెట్ వేశారు. గ్రీన్ మ్యాట్ వేసి, లక్షల లీటర్ల నీటిని ఉపయోగించారు.
మరోవైపు ఈ క్లైమాక్స్ పార్ట్ కోసం ప్రభాస్ కూడా దాదాపు 3 నెలలు కష్టపడ్డాడు. సినిమా విడుదలైన తర్వాత షిప్ ఎపిసోడ్ కు సంబంధించిన మేకింగ్ ను విడుదల చేయబోతున్నారు.