సంక్రాంతి బరిలో తనది మూడో స్థానం అని అంగీకరించారు దిల్ రాజు. చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలయ్య చేస్తున్న వీరసింహారెడ్డి సినిమాల్ని కాదని.. తను నిర్మిస్తున్న వారసుడు సినిమాకు భారీ థియేటర్లు కేటాయించుకుంటున్నాడనే విమర్శల్ని దిల్ రాజు తిప్పికొట్టారు.
“చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్ని ఆపేది ఎవరు. సంక్రాంతి బరిలో అత్యథిక థియేటర్లు ఆ రెండు సినిమాలకే దక్కుతాయి. మూడో స్థానంలో నేను నిర్మిస్తున్న వారసుడు సినిమా ఉంటుంది. ఈ విషయంపై నాకు ఫుల్ క్లారిటీ ఉంది. నాకు థియేటర్లు ఉంటే సరిపోదు. అందరూ సహకరించాలి కదా. పైగా చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్ని కాదని నేనెందుకు థియేటర్లు ఆపుతాను. ఇదంతా అబద్ధపు ప్రచారం.”
ఇలా తనపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు దిల్ రాజు. అయితే తనకంటూ మార్కెట్లో కొన్ని థియేటర్లు ఉన్నాయని, వాటిలో మాత్రం తన వారసుడు సినిమానే వేసుకుంటానని… తన సినిమాను పక్కనపెట్టి, చిరంజీవి-బాలయ్య సినిమాలకు తన థియేటర్లు ఇచ్చేంత పెద్ద మనసు తనకు లేదని తెగేసి చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లోని కీలకమైన సెంటర్లు దిల్ రాజు చేతిలో ఉన్నాయి. అక్కడ రెండు స్క్రీన్స్ ఉంటే, ఒక స్క్రీన్ చిరంజీవి లేదా బాలయ్య సినిమాకు ఇస్తానని, మరో స్క్రీన్ లో తన సినిమా వేసుకుంటానని చెబుతున్నారు దిల్ రాజు. అదే సింగిల్ స్క్రీన్ ఉంటే తన సినిమానే అందులోకి వస్తుందని నిర్మోహమాటంగా చెబుతున్నారు. థియేటర్ల కౌంట్ పరంగా చూసుకుంటే మాత్రం చిరంజీవి, బాలకృష్ణ తర్వాతే తన సినిమాకు స్క్రీన్స్ ఉంటాయని అంటున్నాడు.