భారీ అంచనాల మధ్య విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా లాంగ్ రన్ లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లకు ఓ రేంజ్ నుంచి భారీ నష్టాలను మిగిల్చే దిశగా సాగిపోతోంది సాహో. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో 350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించి, ఇటీవలే విడులైన సాహో సినిమా ప్రొడ్యూసర్ల జేబులు నింపచ్చు కానీ, ఆ సినిమా థియేట్రికల్ హక్కులను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం మొండిచెయ్యినే చూపిందని సమాచారం.
సాహో భారీహైప్‌ను దృష్టిలో ఉంచుకుని కోట్లకు కోట్లు వెచ్చించి మరీ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడ్డారు. వీరిలో దిల్ రాజు కూడా ఒకరు. నైజాం, ఉత్తరాంధ్ర రైట్స్ కోసం దిల్ రాజు ఏకంగా 56 కోట్లు సమర్పించుకున్నట్టు తెలిసింది. మొదటి నాలుగు రోజులు శెలవు దినాలు కావడంతో ఓ మోస్తరు కలెక్షన్స్ రాబట్టినా, ఆ తర్వాత సాహో కలెక్షన్స్ డీలా పడిపోవడంతో ఇప్పుడు దిల్ రాజుకు దాదాపు 20 కోట్లకు పైగానే నష్టాలు రావచ్చనేది ఒక అంచనా.
ఇప్పుడు తాజాగా సాహో టీమ్ నష్ట నివారణ చర్యలకు పూనుకున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే దిల్ రాజుకు సహాయం అందించాలని డిసైడ్ అయ్యారట. అలాగే ఆ బాధ్యతను స్వయంగా ప్రభాస్ చేతికే అప్పజెప్పారని అంటున్నారు. మరి ఇంతకీ ప్రభాస్ 20 కోట్లు నగదు రూపేణా దిల్ రాజుకు తిరిగిస్తాడా, లేక ఇక్కడ మరేదైనా ఆలోచన ఉందా అనేది తెలియాల్సి ఉంది. బహుశా దిల్ రాజు బేనర్లో ప్రభాస్ రెమ్యూనరేషన్ లేకుండా, లేదా తక్కువ రెమ్యూనరేషన్‌తో ఒక సినిమా చేసి తనకు జరిగిన నష్టాన్ని పూరిస్తాడేమో చూద్దాం.