టాలీవుడ్ లో త్వరలోనే షూటింగ్స్ నిలిచిపోతాయని, నిర్మాతలంతా తమతమ సినిమాల షూటింగ్స్ ఆపేస్తారంటూ కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు నిర్మాతలు ఆలోచన చేసిన విషయం కూడా వాస్తవం. అయితే.. ఆగస్ట్ 1 నుంచి సమ్మె అంటూ వస్తున్న కథనాల్లో మాత్రం వాస్తవం లేదని ప్రకటించాడు దిల్ రాజు. ఇప్పటికిప్పుడు షూటింగ్స్ ఆపేస్తే, నష్టపోయేది నిర్మాతలే అని తెలిపాడు.
“షూటింగ్స్ బంద్ అని చాలా వార్తలు వచ్చేశాయి. వాటిలో ఎలాంటి నిజం లేదు. పది మంది కూర్చొని మాట్లాడుతున్నప్పుడు రకరకాల వాదనలు వస్తాయి. షూటింగ్ లు బంద్ పెట్టాలనేది వాటిలో ఒకటి మాత్రమే. దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చర్చలైతే నడుస్తున్నాయి. ఎన్ని రోజులు జరుగుతాయో నాకు కూడా తెలీదు. 20 మంది ప్రొడ్యూసర్లతో ఓ హాల్ లో కూర్చొని మాట్లాడేటప్పుడు, అది కనీసం వంద మందికి చేరిపోతుంది. అలాంటప్పుడు అందులో సీక్రెట్ ఎందుకుంటుంది. 10 నిమిషాల కిందట మాట్లాడిన విషయం బ్రేకింగ్ న్యూస్ గా వచ్చేస్తోంది. కాకపోతే అవన్నీ మాటల వరకే, ఏదీ నిర్ణయం తీసుకునే వరకు రాలేదు. సమ్మె చేస్తే నష్టపోయేది మేమే కదా. అలా అని షూటింగ్స్ కొనసాగించే పరిస్థితి లేదు. అందుకే నిర్మాణాత్మకమైన, సహేతుకమైన పరిష్కారం కోసం అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం.”
ఇలా టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ అంటూ వస్తున్న కథనాలను తిప్పికొట్టాడు దిల్ రాజు. ప్రస్తుతం నిర్మాతలమంతా కూర్చొని కేవలం 3 అంశాలపైన మాత్రమే చర్చిస్తున్నామన్నాడు.
“మంచి కంటెంట్ ఇవ్వాలి. ప్రేక్షకుడికి అనుకూలంగా ఉండే రేటు పెట్టాలి. ఓటీటీలో సినిమా లేటుగా రావాలి. ఈ 3 పాయింట్ల అజెండాతోనే చర్చలు సాగుతున్నాయి. టాలీవుడ్ లో ప్రస్తుతం సక్సెస్ రేటు 10శాతంగా ఉంది. అది 7శాతం, 5శాతానికి కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే మంచి కంటెంట్ ఇవ్వాల్సిందే. రేట్లు తగ్గించాల్సిందే. ఓటీటీకి దూరంగా జరగాల్సిందే.”
మరికొన్ని రోజుల్లో టాలీవుడ్ లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని ఆశాభావం వ్యక్తంచేశాడు దిల్ రాజు. పెద్ద హీరోల పారితోషికాలపై స్పందిస్తూ, టాలీవుడ్ హీరోలందరి మనసు బంగారమని, ఓ ప్రపోజల్ తో నిర్మాతలంతా వెళ్తే, హీరోలు ఎప్పుడూ తిరస్కరించరని అంటున్నాడు.