సంక్రాంతి సినిమాల రిలీజ్ విషయంలో ఇప్పటికే వివాదాస్పదమయ్యాడు నిర్మాత దిల్ రాజు. చిరంజీవి, బాలయ్య సినిమాల్ని కాదని, ఓ తమిళ హీరోతో తను తీస్తున్న వారసుడు సినిమాకు కీలకమైన సెంటర్లు పెట్టుకున్నాడు. దీనిపై తన వాదన తను బలంగానే వినిపించాడు. తన థియేటర్లలో తన సినిమా కాకుండా, వేరే నిర్మాతల సినిమాలు ఎందుకు వేస్తాననేది దిల్ రాజు వాదన. ఇది కరెక్ట్.
ఇప్పుడు ఇదే నిర్మాత మరో వివాదానికి కేంద్రబిందువయ్యాడు. సంక్రాంతి తర్వాత సాఫీగా థియేటర్లలోకి వద్దామనుకునే నిర్మాతలకు కూడా అడ్డుతగులుతున్నాడు.
ఫిబ్రవరి నెలలో విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ, ధనుష్ హీరోగా నటించిన సర్, గీతాఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న వినరో భాగ్యము విష్ణుకథ సినిమాలు వస్తున్నాయి. ఈ 3 సినిమాలు ఫిబ్రవరి 17న రాబోతున్నట్టు గతంలో ప్రకటనలు ఉన్నాయి.
ఈ విషయం తెలిసి కూడా తన కొత్త సినిమాను అదే తేదీకి ప్రకటించారు దిల్ రాజు. అవును.. సమంత లీడ్ రోల్ పోషిస్తున్న శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు దిల్ రాజు సహనిర్మాత అనే విషయం తెలిసిందే.
ఇకపై తన థియేటర్లలో, తన కోటరీకి చెందిన ధియేటర్లలో తమ సినిమాలు మాత్రమే వేయాలని దిల్ రాజు గట్టిగా నిర్ణయించుకున్నట్టుంది. ఈ మేరకు ఇప్పటికే సంక్రాంతి సినిమాలకు తన థియేటర్లు ఇవ్వకుండా, మైత్రీ వాళ్లకు గట్టి షాక్ ఇచ్చిన దిల్ రాజు, ఇప్పుడు ఫిబ్రవరి సినిమాల విషయంలో కూడా అదే మంకుపట్టు చూపిస్తున్నట్టుంది.