విజయ్ హీరోగా వారసుడు సినిమా నిర్మిస్తున్నాడు దిల్ రాజు. ఈ సినిమాను చిరంజీవి, బాలయ్య చిత్రాలకు పోటీగా సంక్రాంతికి దించుతున్నాడు. అతడి చేతిలో థియేటర్లున్నాయి, డిస్ట్రిబ్యూటర్లున్నారు కాబట్టి అంతా నడిచిపోతుంది. కానీ ఇవి మాత్రమే ఉంటే సరిపోతుందా? చేతిలో థియేటర్లు ఉంటే ఏ సినిమా అయినా వేసుకోవచ్చా?
సరిగ్గా ఇక్కడే ఉత్తరాంధ్ర నుంచి దిల్ రాజుకు నిరసన సెగ తగులుతోంది. ఉత్తరాంధ్రలో పూర్తిగా తెలుగు జనాలుంటారు. అక్కడి వాళ్లకు హిందీ, తమిళ చిత్రాలు పట్టవు. ఎంతో హిట్ టాక్ వస్తే తప్ప డబ్బింగ్ సినిమాలు చూడరు. అలాంటిది సంక్రాంతి సీజన్ లో విజయ్ సినిమా వేస్తాం చూడండి అంటే చూస్తారా?
ఇప్పుడదే జరుగుతోంది. బాలయ్య, చిరంజీవి సినిమాల్ని కాదని, తమ థియేటర్లలో వారసుడు చిత్రాన్ని ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని అంటున్నాయి ధియేటర్ యాజమాన్యాలు. ఈ మేరకు ఇదివరకే విడుదలైన ఫిలింఛాంబర్ లేఖను వాళ్లు చూపిస్తున్నారు.
సంక్రాంతి సీజన్ లో ముందుగా స్ట్రయిట్ మూవీస్ కు మాత్రమే అవకాశం ఇవ్వాలని, ఆ తర్వాతే వారసుడు చిత్రాన్ని ప్రదర్శించాలని అంటున్నారు. ఇవన్నీ పక్కనపెడితే, కాసులు కురిసే సంక్రాంతి సీజన్ లో చిరంజీవి, బాలయ్య సినిమాల్ని వదిలేసి, వారసుడు వేస్తే తమకు గిట్టుబాటుకాదని చాలామంది ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. ఈ విషయంలో ఉత్తరాంధ్ర ఎగ్జిబిటర్ల సంఘం ఒక తీర్మానం చేసే ఆలోచనలో ఉంది.