నిర్మాతల మండలి మాజీ అధ్యక్షుడు సి. కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజు గిల్డ్ మాఫియా బ్యాచ్ అని.. గిల్డ్ మాఫియా వల్ల చిత్ర పరిశ్రమ ప్రమాదంలో పడబోతుందని అన్నారు. అయితే టాలీవుడ్ లోని నిర్మాతల మండలి నూతన కార్యవర్గ ఎన్నికలు జరగనున్న వేళ ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఈ మాఫియా చిన్న సినిమాలను అణగదొక్కుతూ పరిశ్రమను నాశనం చేస్తుందన్నారు ఆయన. ఆదివారం నిర్మాతల మండలి నూతన కార్యవర్గానికి ఎన్నికలు జరుగనున్న వేళ మీడియా ముందుకు వచ్చి సి. కళ్యాణ్.. గిల్డ్ పేరుతో 27 మంది నిర్మాతలు పరిశ్రమను ఎలా దోపిడీ చేస్తున్నారో వివరించారు. నిర్మాతల మండలి సభ్యుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన ఎల్ఎల్పిని తప్పుదోవ పట్టించి..వాణిజ్య ప్రకటనలు, అవార్డుల పేరుతో డబ్బు దోచుకుంటున్నారని ఆరోపించారు.
నిర్మాతల మండలి ఎన్నికల్లో గిల్డ్ సభ్యులు పోటీ చేస్తుండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆయన. చిన్న నిర్మాతలను బతికిస్తేనే చిత్ర పరిశ్రమ బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న దామోదర ప్రసాద్ తరపున ప్రముఖ నిర్మాత దిల్ రాజు మద్దతు పలుకుతున్నారు.
కాగా దిల్ రాజును తప్పుదోవ పట్టించి ప్రచారాన్ని సాగిస్తున్నారని పేర్కొన్న కళ్యాణ్.. గిల్డ్ మాఫియాలో దిల్ రాజు కూడా భాగస్వామేనని విమర్శించారు. మరోవైపు ఈ ఎన్నికలపై దిల్ రాజు స్పందించారు. అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న దామోదర ప్రసాద్ కు మద్దతు పలికిన ఆయన ప్రొగ్రెసివ్ ప్రొడ్యూసర్ ప్యానెల్ పేరుతో పోటీలో ఉన్న సభ్యులకు ఓటు వేయాలని నిర్మాతలను కోరారు.