టాలీవుడ్ సంక్షేమం కోసం తను ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ప్రకటించాడు నిర్మాత దిల్ రాజు. ఓ వైపు పెద్ద సినిమాలన్నీ వరుసగా వాయిద పడుతున్న నేపథ్యంలో.. ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద సినిమా కోసం తన సినిమాల్ని పోస్ట్ పోన్ చేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. ఇండస్ట్రీ బాగు కోసం తనకు నష్టమొచ్చినా పర్వాలేదంటున్నారు దిల్ రాజు.
“ఇండస్ట్రీ రేంజ్ పెరగాలి. పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవ్వాలి. అందుకే నా ఎఫ్3 సినిమాను వాయిదా వేసుకున్నాను. ఆర్ఆర్ఆర్ సినిమాను మార్చి 18 లేదా ఏప్రిల్ 28 అన్నారు. 2 డేట్స్ చెప్పారు. నిజానికి ఏప్రిల్ 28 న నేను ఎఫ్3 రిలీజ్ పెట్టుకున్నాను. కానీ తగ్గుతాను. ఆర్ఆర్ఆర్ ఏప్రిల్ 28కి వస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను ఎఫ్3 వాయిదా వేసుకుంటాను. ఎందుకంటే, ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా సినిమా. అలాంటి సినిమాలకు ఇబ్బందులు ఉండకూడదు. అంతా కలిసి కూర్చొని మాట్లాడుకొని విడుదల తేదీలపై నిర్ణయాలు తీసుకోవాలి.”
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో తగ్గించిన టికెట్ రేట్లపై కూడా స్పందించాడు దిల్ రాజు. ఆ ఇష్యూపై ఏర్పాటైన కమిటీ చురుగ్గా పనిచేస్తోందన్న దిల్ రాజు.. ఏపీలో టికెట్ రేట్లు మళ్లీ పెరుగుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. త్వరలోనే కరోనా పరిస్థితులు కూడా తగ్గుముఖం పడతాయని.. పెద్ద సినిమాలన్నీ రాబోయే 3 నెలల్లో థియేటర్లలోకి వస్తాయని అంటున్నారు రాజు.
కరోనా టైమ్స్ లో తను నిర్మించిన రౌడీ బాయ్స్ సినిమా రిలీజ్ అవ్వడంపై కూసింత బాధ వ్యక్తంచేశారు దిల్ రాజు. నిజంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. తన సినిమాకు ప్రాపర్ గా ప్రమోషన్ ఇచ్చి, మంచి హైప్ తో రిలీజ్ చేసేవాడినని, అప్పుడు రిజల్ట్ మరో విధంగా ఉండేదని చెప్పుకొచ్చాడు.