పంజాబ్ లో పాగా వేయాలని తీవ్ర ప్రయత్నాల్లో ఉంది బీజేపీ. దూకుడు మీదున్న ఆప్, కాంగ్రెస్ కు చెక్ పెట్టాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా మాజీ క్రికెటర్ దినేష్ మోంగియాకు కాషాయ కండువా కప్పేసింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పంజాబ్ వ్యవహారాల ఇంచార్జ్ గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో బీజేపీ గూటికి చేరారు మోంగియా.
ఈ సందర్భంగా మోంగియా మాట్లాడుతూ.. పంజాబ్ ప్రజలకు సేవ చేయడం కోసం బీజేపీలో చేరానని చెప్పారు. ప్రస్తుతం బీజేపీ మినహా మరే పార్టీ దేశాన్ని అభివృద్ధి చేయలేదని అభిప్రాయపడ్డారు.
మోంగియాతోపాటు మరో ముగ్గురు నేతలు ఫతేహ్ జంగ్ బజ్వా, రానా గుర్మీత్ సోధి, బల్వీందర్ సింగ్ కూడా బీజేపీలో చేరారు. రానా గుర్మీత్ వారం క్రితమే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పగా.. ఫతేహ్ తన అనుచరుడు బల్వీందర్ తో కాషాయ కండువా కప్పుకున్నారు.
వీరితోపాటు రిటైర్డ్ ఏడీసీ, పంజాబ్ హర్యానా హైకోర్టులో న్యాయవాది మధుమీత్ కూడా బీజేపీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు షెకావత్.